Skip to main content

RBI: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐ నివేదిక.. తాజా ఆవిష్కరణలు ఇవే..

దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్‌ సానుకూల అంశాలను వెలువరించాయి.
RBI report on banking system

అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్‌ ఆర్‌బీఐ బులెటిన్‌లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్‌ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలు ఇవే.. 

ధరల్లో స్థిరత్వం..
‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్‌ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్‌ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చింది. డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్‌ రూపొందించిన ఈ ఆర్టికల్‌, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది.
 
ద్రవ్యోల్బణం తగ్గుదల..
ఆర్‌బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్‌ జాన్, ఆసిష్‌ థామస్‌ జార్జ్‌లు రాసిన మరో ఆర్టికల్‌ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్‌ ఫుడ్‌ ప్రైసెస్‌ స్పిల్లింగ్‌ ఓవర్‌? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్‌లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన  ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్‌ పేర్కొంది. 

Repo Rate: తొమ్మిదవ సారి మారని రెపో రేటు.. ప్ర‌స్తుతం ఎంతుందో తెలుసా..

నిధులకోసం ప్రత్యామ్నాయాలు..
డిపాజిట్‌ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్‌ పేపర్, డిపాజిట్‌ సర్టిఫికేట్‌ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్‌ చూస్తోందని బులెటిన్‌ ప్రచురితమైన మరో ఆర్టికల్‌ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్‌ డిపాజిట్‌ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్‌ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్‌ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది.

Published date : 20 Aug 2024 05:30PM

Photo Stories