Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 15th కరెంట్ అఫైర్స్
National sports awards : శ్రీజ, నిఖత్‌లకు ‘అర్జున’.. శరత్ కమల్‌కు ‘ఖేల్‌రత్న’
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్‌డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ లభించింది. నవంబర్ 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు.
Also read: ICC T20 : టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి చోటు వీరికే..
తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు.
మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.
Also read: Asian Boxing Championship: రజతంతో శివ థాపా రికార్డు
తెలంగాణ స్టార్లకు...
ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్‌లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్‌లో కాంస్య పతకంతో మెరిసింది.
Also read: Filmfare Awards 2022 : 'పుష్ప' తగ్గేదేలె.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో క్లీన్ స్వీప్..
అవార్డీల జాబితా
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్).
అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకరి్ణ, ప్రజ్ఞానంద (చెస్), దీప్‌గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్‌లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్విన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్).
RBI: పిల్లలకు ఇక ఆర్థిక పాఠాలు
న్యూఢిల్లీ: దేశంలో మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆర్‌బీఐ సూచించే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడానికి అంగీకరించాయి. ఆర్‌బీఐ, ఇతర నియంత్రణ సంస్థలు సంయుక్తంగా ఆర్థిక అక్షరాస్యత అంశాలను రూపొందించాయి. దీంతో స్కూల్ పాఠ్యాంశాల్లో ప్రాథమిక ఆర్థిక అంశాలకు చోటు లభించనుంది. ‘‘పాఠశాల విద్యలో ఆర్థిక అక్షరాస్యతను మనం చేర్చితే, దేశంలో ఆర్థిక జ్ఞానం విస్తరించేందుకు తోడ్పడుతుంది. 6–10 తరగతుల పాఠాల్లో దీన్ని చేర్చనున్నా’’అని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ అన్నారు.
Retail Inflation : అక్టోబర్‌లో 8.39 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత నవంబర్ 12 న వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్‌బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.
Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
రిటైల్ ధరలు ఇలా...
- సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం.
- ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది.
- ఆహార ద్రవ్యోల్బణం సెపె్టంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది.
- కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచి్చంది.
- ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది.
- డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనాగా ఉంది.
టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం
- ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది.
- కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది.
- వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి.
- నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది.
- ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది.
Amazon Founder: ఆస్తిలో సింహభాగం సేవకే: Jeff Bezos
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు.
Prasar Bharati: కొత్త సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది ప్రభుత్వరంగ ప్రసారభారతి సీఈవోగా సోమవారం నియమితులయ్యారు. ఆయన 1995వ బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్ అధికారి. ఇప్పటిదాకా ప్రభుత్వ మైగవ్‌ఇండియా సీఈవోగా చేశారు. ప్రస్తుత సీఈఓ శశి శేఖర్ వెంపటి పదవీ కాలం జూన్‌తో ముగిసింది.
G20 Summit: ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించడం, ఆహార, ఇంధన భద్రత తదితర కీలకాంశాలపై పలువురు దేశాధినేతలతో లోతుగా చర్చస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మొదలవుతున్న 17వ జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మూడో రోజుల పర్యటన నిమిత్తం ఆయన నవంబర్ 14 న ఇండొనేసియాలోని బాలికి చేరుకున్నారు.
Also read: G20 Summit 2022: భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు.. సదస్సుకు ముందుగానే మోదీ..
పలు రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతి, గ్లోబల్ వార్మింగ్ తదితర ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని జీ 20 వేదికపై ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది (2023) భారత్ సారథ్యంలో జరిగే జీ 20 సదస్సుకు ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో విడిగా భేటీ అవుతానని వెల్లడించారు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్‌పింగ్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు.
Also read: G-20 : భారత్ నాయకత్వం.. G-20 లోగో, థీమ్, వెబ్‌సైట్ ఆవిష్కరణ..
మనకు గొడవలొద్దు–జిన్‌పింగ్‌తో భేటీలో జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ నవంబర్ 14న ఇండొనేషియాలోని బాలీలో సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌తో బైడెన్‌కు ఇదే తొలి ముఖాముఖి! తైవాన్ తదితర అంశాల్లో ఇటీవల ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భేదాభిప్రాయాలు తొలగించుకునేందుకు కలిసి పనిచేద్దామని బైడెన్ అన్నారు.
Central Sahitya Akademi: పత్తిపాక మోహన్‌కు బాలసాహిత్య పురస్కారం ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ/సిరిసిల్ల కల్చరల్: బాలల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.నవంబర్ 14 న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’గేయ కథకుగాను ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్, అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావులు అందించారు.
Also read: Thapi Dharmarao award 2022: ప్రముఖ కార్టూనిస్టు సరసికి బహూకరణ
2022 గాను మొత్తం 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాలు అందించింది. డాక్టర్ సి. నారాయణరెడ్డి శిష్యుల్లో ఒకరైన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు. కవి, సాహిత్య విమర్శకులు అయిన మోహన్.. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులుగా బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువాదం చేశారు. పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్న యువతరంతో పాటు, మత విద్వేషాలు పెరుగుతున్న సమాజానికి మహాత్మా గాంధీ చూపిన బాట అవసరమని పత్తిపాక మోహన్ అభిప్రాయపడ్డారు. అంతేగాక ఈ తరం పిల్లలకు గాంధీ గురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మాగాంధీపై తాను రాసిన పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Nallamala forest: అరుదైన ఔషధిగా ‘అగ్నిశిఖ’(Gloriosa superba)
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి.
Also read: ICAR-IIRR: ‘మెరుగైన సాంబమసూరి’ రకం వంగడం
ఆయుర్వేదంలో దివ్యౌషధం: ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. వీర్యవృద్ధికి కూడా ఉపయో గపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘ కాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖ వ్యాధుల చికిత్సలోనూ అడవి నాభి ఉపయోగపడుతుంది.
అడవినాభి అద్భుతమైన ఔషధి
నల్లమలలో లభించే అడవినాభి అరుదైన ఔషధ మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వాడతారు.
– ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP