C R Rao: భార‌తీయ అమెరిక‌న్‌కు నోబెల్‌తో స‌మాన‌మైన అంత‌ర్జాతీయ అవార్డు... ఎవరీ సీఆర్ రావు.. స్టాటిస్టిక్స్‌లో ఆయ‌న సాధించిన ఘ‌న‌త‌లేంటి..?

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు(102) స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు సీఆర్‌ రావును వరించింది.
భార‌తీయ అమెరిక‌న్‌కు అంత‌ర్జాతీయ అవార్డు... ఎవరీ సీఆర్ రావు.. స్టాటిస్టిక్స్‌లో ఆయ‌న సాధించిన ఘ‌న‌త‌లేంటి..?

ఈ ఏడాది మే1 ఆయ‌న‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించారు. ఈ జులైలోనే ఆయ‌న‌కు అవార్డును అంద‌జేయ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న జీవిత విశేషాలు మీకోసం... 

1945లో కలకత్తా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి ఈ అవార్డును అంద‌జేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెస‌ర్ బ్రాడ్లీ ఎఫ్రాన్‌, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెస‌ర్ Emerita Nan Laird ల‌కు అంద‌జేశారు. 2023కి సీఆర్ రావుకు అవార్డు అంద‌నుంది. భారత స్టాటిస్టిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 

Inspirational Story: కూలీనాలీ చేసుకుంటూ చ‌దువుకున్నా.. ఇప్పుడు గ‌ర్వంగా పీహెచ్‌డీ సాధించా... ఈ చ‌దువుల త‌ల్లికి స‌లాం కొట్టాల్సిందే

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ....
సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. 

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్‌ రంగానికే కాకుండా ఎకనమిక్స్‌, జెనెటిక్స్‌, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Success Story: ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న రావు.. ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు.

సీఆర్‌ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్ భారీగా వాడటానికి ఉపయోగపడుతున్నాయి. 

IAS Success Story: 16 ఏళ్ల‌కే వినికిడి శ‌క్తి కోల్పోయా... కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఐఏఎస్ సాధించానిలా...

మొదటిది.. క్రామెర్‌-రావు లోయర్‌ బౌండ్‌. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తుమ విధానాన్ని సూచించింది. రెండవది రావు-బ్లాక్‌వెల్‌ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు సహాయపడుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన కణ యాక్సిలరేటర్ అయిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ వద్ద హిగ్స్ బోసాన్ కొలతలను అర్థం చేసుకోవడానికి, ఆప్టిమైజేషన్ చేయడానికి సమాచార జామెట్రీని ఉపయోగించారు.

Civils Rankers: అతి పిన్న వ‌య‌సులో ఐఏఎస్ అయ్యింది వీరే... వీరి కుటుంబ నేప‌థ్యం ఏంటంటే...

నోబెల్‌తో స‌మాన‌మైన ప్రైజ్‌... 
ఐదు ప్రముఖ అంతర్జాతీయ గణాంకాల సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గణాంకాల(స్టాటిస్టిక్స్‌)లో అంతర్జాతీయ బహుమతిని అందజేస్తారు. గణాంక రంగంలో ఒక వ్యక్తి లేదా బృందం సాధించిన విజయాన్ని గుర్తించి దీనిని అందజేస్తారు. నోబెల్ బహుమతులు, అబెల్ ప్రైజ్, ఫీల్డ్స్ మెడల్, ట్యూరింగ్ అవార్డుల తర్వాత ఈ బహుమతిని రూపొందించారు.

#Tags