Bharat Ratna: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది.

జ‌న‌వ‌రి 24వ తేదీ ఆయన వందో జయంతి. ఠాకూర్‌ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జ‌న‌వ‌రి 23వ తేదీ (మంగళ­వారం) భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించి ప్రాధాన్యతను సంతరించుకుంది. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్‌ బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్‌ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది.

రెండుసార్లు సీఎంగా సేవలు..
బిహార్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్‌ నేతగా చరిత్ర సృష్టించారు. బిహార్‌కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారిగా సీఎంగా 1970 డిసెంబర్‌ నుంచి 1971 జూన్‌ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్‌ నుంచి 1979 ఏప్రిల్‌ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డెప్యూటీ సీఎంగానూ చేశారు. ‘ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్‌. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Miss America 2024: మిస్‌ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణి..!

విద్యార్థి దశలోనే స్వతంత్ర పోరాటంలోకి..
ఠాకూర్‌ బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో కర్పూరిగ్రామ్‌లో 1924 జనవరి 24వ తేదీన జన్మించారు. ఈ గ్రామం పూర్వం బ్రిటిష్‌ ఇండియా పాలనలో బిహార్‌–ఒడిశా ప్రావిన్స్‌లో పితౌజియా పేరుతో పిలవబడేది. పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరిగ్రామ్‌గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్పూరి ఠాకూర్‌ జన్మించారు. ఠాకూర్‌కు చిన్నప్పటి నుంచి విప్లవభావాలు ఎక్కువే.

కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఠాకూర్‌ను 1942, 1945లో అరెస్ట్‌చేసి జైలులో పడేసింది. స్వాతంత్య్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. రామ్‌ మనోహర్‌ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాశ్‌ నారాయణ్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలసి పోరాటం చేశారు.

జన నాయకుడు..
బిహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్‌ కమిషన్‌ సిఫార్సులను 1978లో అమలుచేశారు. మండల్‌ కమిషన్‌కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అత్యంత వెనుకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషనే తీసుకొచ్చింది. 1952లో తొలిసారిగా సోషలిస్ట్‌ పార్టీ తరఫున తేజ్‌పూర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బిహార్‌ శాసనసభకు ఎన్నికయ్యారు.

తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు. 1970లో బిహార్‌ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుచేసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనక ఈయన పాత్ర ఉంది. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్‌ కుమార్, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకు ఠాకూర్‌ రాజకీయ గురువు. 1988లో తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్‌నాథ్‌ ఠాకూర్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

Oscar Nominations 2024: ఆస్కార్‌ నామినేషన్స్‌ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!

#Tags