మన తెలుగుతేజాలు-సీఏ సీపీటీలో చిచ్చర పిడుగులు...

మొన్న ఎయిమ్స్... నిన్న జేఈఈఅడ్వాన్స్‌డ్, మెయిన్... నేడు సీఏ సీపీటీలో సత్తాచాటారు. అఖిల భారత స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. సీఏ కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ)- 2014లో అత్యధికంగా 197 మార్కులు ప్రకాశం జిల్లాకు చెందిన బొర్రా మురళీమోహన్‌కు లభించాయి. అలాగే టాప్‌టెన్ స్థానాల్లో మన విద్యార్థులు ఏడుగురు నిలవడం విశేషం.

అక్క స్ఫూర్తి... అగ్ర కీర్తి
అక్కను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఆమె ఎంచుకున్న రంగంలోనే పయనించాలనుకున్నాడు. సబ్జెక్టు పరంగా కొత్త అయినా కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివాడు. అమ్మా,నాన్నల ప్రోత్సాహం, గురువుల సహకారంతో లక్ష్యం వైపు గురిపెట్టాడు. అలా తొలి ప్రయత్నంలోనే సంధించిన అస్త్రం అబ్బురపరిచే విజయాన్ని అందించింది. జాతీయస్థాయిలో సీఏ-కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ -2014లో నంబర్‌వన్‌గా నిలబెట్టిందని చెబుతున్నాడు బొర్రా మురళీ మోహన్. సీఏ సీపీటీలో అగ్రస్థానం ఎలా సాధ్యమైంది? సీఏ కోర్సును ఎంచుకోవడానికి కారణాలేంటి? అనే విషయాలు అతని మాటల్లోనే తెలుసుకుందాం.

నాన్న టీచర్:
మా స్వస్థలం ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర బయనపల్లె. నాన్న వెంకటనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి. గృహిణి. అక్క దీపాజ్యోతి. సీఏలో ఐపీసీసీ పాసయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్టికల్‌షిప్ చేస్తున్నారు.

అక్కను చూసే ఎంచుకున్నా:
సీఏ చేయాలన్న లక్ష్యానికి అక్క దీపాజ్యోతే కారణం. ఆ విషయాన్ని నాన్నకు చెప్పాను. సరేనన్నారు. అలా మాస్టర్‌మైండ్‌‌సలో ఎంఈసీ గ్రూప్‌లో చేరాను.

రెండు ప్రశ్నలను వదిలేశా:
సీఏ సీపీటీ పరీక్షలో 198 ప్రశ్నలకు సమాధానాలను రాశాను. ఎకనామిక్స్‌లో రెండింటి కి సరైన సమాధానాలు తెలియక వదిలేశాను. మొత్తంగా ఒక్కటే తప్పయింది. దీంతో 196.75 మార్కులు వచ్చాయి. వాటిని రౌండప్ చేస్తూ 197గా ప్రకటించారు. 194-195 మధ్య మార్కులు వస్తాయని ఊహించాను. కానీ అత్యధికంగా 197 రావడంతో చాలా అనందంగా ఉంది.

ఒత్తిడికి దూరంగా:
సబ్జెక్టును ఇష్టంగా చదివాను. సందేహాలు వచ్చినప్పుడు తోటిస్నేహితులతో చర్చించాను. సాధ్యం కాకపోతే ఫ్యాకల్టీ సహకారం తీసుకున్నాను. చదివినంత సేపూ ప్రతీ అంశాన్ని ఆస్వాదిస్తూ ముందుకువెళ్లాను. చదువులో ఏనాడూ ఒత్తిడికి గురికాలేదు. ఒక్క పరీక్ష రాసేసమయంలో సమయం సరిపోతుందా? లేదా? అనే విషయంలో కొద్దిపాటి ఒత్తిడి కి గురయ్యాను.

రివిజన్ టెస్ట్‌లలో నాలుగో ర్యాంక్:
కాలేజీలో రెండు రోజులకోసారి రివిజన్ టెస్టులు నిర్వహించే వారు. వీటిలో ఎప్పుడూ నాలుగో స్థానం నాదే. ఇప్పుడు సీఏ సీపీటీలో జాతీయస్థాయిలో నాలుగో ర్యాంక్ రావడం కాకతాళీయంగానే జరిగిపోయింది.

అందరికీ భిన్నంగా:
సీఏ చేస్తే నాలుగేళ్లలోనే కెరీర్‌లో స్థిరపడవచ్చన్నది నా భావన. అందుకే ఈ కెరీర్‌ను ఎంచుకున్నాను. దీనికితోడు అందరిలా కాకుండా నాకంటూ ప్రత్యేకముద్ర వేసుకోవాలనేది నా కోరిక.

సీఏ సీపీటీ రాసేవారికి సలహా:
ఏ కోర్సులోనైనా ముందు సబ్జెక్టువారీగా అవగాహన ఏర్పరచుకోవాలి. తరగతుల్లో చెప్పింది ఏ రోజుకారోజు చదవాలి. ముఖ్యమనిపించిన పాయింట్లను గుర్తించి ప్రత్యేకంగా నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. మోడల్‌టెస్ట్‌లు రాయాలి. ఏ సబ్జెక్‌లో వెనుకబడి ఉన్నామో గుర్తించి మరింత దృష్టి సారించాలి. వీటిని పాటిస్తూ ప్రణాళికతో కూడిన ప్రిపరేషన్ సాగిస్తే ఏదైనా సాధ్యమే.

తల్లిదండ్రుల సహకారం:
నా ఇష్టాఇష్టాలను ఎప్పుడూ వారు కాదనలేదు. సీఏ చేస్తానంటే నాన్న ప్రోత్సహించారు. అక్క సలహాలు తీసుకొమ్మంటూ సూచించారు.

ఐపీసీసీలోనూ టాపర్‌గా రాణిస్తా:
వచ్చే ఏడాది మేలో జరిగే ఐపీసీసీ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాం. మాస్టర్‌మైండ్‌‌సలో లాంగ్‌టెర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. కష్టపడి చదివి అందులో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా.

సివిల్స్ రాస్తా:
ముందు సీఏగా రాణించాలి. ఆ తర్వాత సివిల్స్‌పై దృష్టి సారిస్తా. అధికారిగా పేదవారికి అండగా నిలుస్తా.

ఈ విజయం.. కన్నవారికి కానుక
తన భవిత కోసం అమ్మానాన్నపడిన రెక్కల కష్టం ఆ కొడుకుని కదిలించింది. ఎలాగైనా వారి ఆశలను నిజం చేయాలనే సంకల్పాన్ని ప్రోదిచేసింది. తండ్రి నిరక్షరాస్యుడు అయినా చదువు విలువేంటో తెలుసు. తనకు ప్రాప్తించని విద్యాకటాక్షం కుమారుడిలో చూసుకోవాలనుకున్నాడు. అలా ఆ తండ్రి నమ్మకాన్ని కొడుకు ఏనాడూ వమ్ము చేయలేదు. చదివే ప్రతీ అక్షరంలోనూ కన్నవారి కాయ కష్టాన్నే తలచుకుంటూ పరితపించాడు. తన విజయాలను కన్నవారికి కానుకగా ఇవ్వాలని కష్టించాడు. ఆ దిశగా వేసిన తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో సీఏ-కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్-2014లో నాలుగో ర్యాంకర్‌గా మెరిశాడు. నిరుపేద అయినా చదువులో యోధగా ఎదిగిన ఓ సాధారణరైతు బిడ్డ బాలు రాంబాబు విజయ ప్రస్థానం...

కుటుంబ నేపథ్యం:
మాది కడప జిల్లా రైల్వేకోడూరు. నాన్నపేరు సూర్యనారాయణ. నిరక్షరాస్యుడు. అమ్మ జ్యోతి. గృహిణి. వ్యవసాయంలో నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటుంది.

అమ్మా, నాన్నల ప్రోత్సాహం:
నాన్నకు అక్షరమంటే తెలీదు. కానీ దాని విలువేంటో తెలుసు. అందుకే అన్నయ్యని, నన్ను బాగా చదివించాలనుకున్నాడు. అన్నయ్యకు అంతగా అబ్బలేదు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు? నీవు బాగా చదువుకోవాలి అంటూ నన్ను ప్రోత్సహించారు. కానీ ఆదాయం అంతంతమాత్రమే. నాలుగెకరాలన్న మాటే గానీ అంతా వర్షాధారం. అయినా నాకోసం వారెన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి.

ఫైనాన్స్ సబ్జెక్ అంటే ఇష్టం:
నాకు ఫైనాన్స్ అంటే ఇష్టం. అందుకే ఇంటర్‌లో తోటి స్నేహితులంతా ఎంపీసీ, బైపీసీలో జాయిన్ అయినా నేను మాత్రం ఎంఈసీ గ్రూప్ ఎంచుకున్నాను. టెన్త్‌లో 570, ఇంటర్‌లోనూ 970 మార్కులే వచ్చాయి.

సీఏ సీపీటీ ఎలా సాగింది?
రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. మొదటి సెషన్‌లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, మర్కంటైల్ లా సబ్జెక్టులలో అకౌంటింగ్‌లో కొంత తడబడ్డాను. ఇక రెండో సెషన్‌లో జనరల్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లను బాగానే కవర్ చేశాను. మొత్తంగా ఎకానమిక్స్‌లో 3, అకౌంటింగ్‌లో 2, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 1 మొత్తం 6 నెగెటివ్ మార్కులు వచ్చాయి. దీంతో 194 మార్కులు సాధించాను. టాప్‌టెన్‌లో వస్తే చాలనుకున్నాను. కానీ నాలుగో ర్యాంకు రావడం ఊహించలేకపోయాను.

త్వరగా కెరీర్‌లో స్థిరపడాలని:
స్వల్పకాలంలోనే మంచి కెరీర్‌ను అందుకోవాలి. అమ్మా,నాన్నలను బాగా చూసుకోవాలి. మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే తపన పదో తరగతిలోనే ఏర్పడింది. అందుకే సీఏ చేయాలనుకున్నాను.

ఇంటర్ నుంచే పునాది:
టెన్త్ పూర్తవగానే ఇంటర్ గుంటూరు మాస్టర్‌మైండ్‌‌సలో చేరాను. అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్మీడి యెట్ సబ్జెక్ట్‌లతో పాటు రోజూ సీపీటీ కోసం సమాంతరంగా శిక్షణనిచ్చేవారు. మొదటి సంవత్సరంలో మూడు నెలలపాటు రెండు గంటలు, రెండో ఏడాదిలో వార్షిక పరీక్షలు ముగియగానే మార్చి నుంచి జూలై వరకు తరగతులు నిర్వహించేవారు. దీర్ఘకాలిక ప్రణాళికతో సాధన సాగింది. సందేహాలు ఏవైనా ఉంటే ఫ్యాకల్టీ అందుబాటులో ఉండి నివృత్తి చేసేవారు.

రివిజన్ టెస్టులతో ప్రయోజనం:
రివిజన్ టెస్టులను రెండు రోజులకోసారి నిర్వహించేవారు. మొదటి పదిమందిలో ఒకడిగా నిలిచేవాడిని. దీంతో టాప్ ర్యాంక్ వస్తుందనే నమ్మకం నాలో ఏర్పడింది. రివిజన్ టెస్టులు ఎంతగానో ఉపకరించాయి. ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో తెలుసుకునేందుకు వీలు కలిగేది.

ఐపీసీసీకి సన్నద్ధమవుతున్నా:
సీఏ సీపీటీ సాధించాను. తర్వాత లక్ష్యం ఐపీసీసీ. వచ్చే ఏడాది మేలో పరీక్ష జరగనుంది. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఐపీసీసీనే. అందులోను టాపర్‌గా నిలవడం కోసం కృషి చేస్తా.

సీఏగా రాణించాలి:
దేశంలో ప్రముఖ చార్టర్‌‌డ అకౌంటెంట్‌లలో ఒకడిగా రాణించాలి. అమ్మా, నాన్నల ఆనందాన్ని చూడాలి.











































#Tags