కమిట్‌మెంట్‌తోనే కల సాకారం..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ).. జాతీయ స్థాయిలో సీఏ పరీక్షలను నిర్వహిస్తుంది. సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థి నాగోలు మోహన్ కుమార్ రెండో ర్యాంకు సాధించాడు. నిబద్ధత, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండడమే తన విజయానికి ముఖ్య కారణమంటున్న మోహన్ కుమార్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే...
మాది చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని చోడవరం. నాన్న నాగరాజురెడ్డి.. వ్యవసాయ పనులు చేస్తుంటారు. అమ్మ మంజుల.. గృహిణి. అన్న భాను ప్రకాశ్.. ఇంజనీరింగ్ పూర్తిచేసి నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నాడు. నా విద్యాభ్యాసం స్థానిక స్కూళ్లో, శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పాఠశాలలో, శ్రీ విద్యాజ్యోతి పబ్లిక్ స్కూళ్లో జరిగింది. తొమ్మిదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివాను. ఒంగోలులో ఇంటర్మీడియట్ పూర్తిచేశాను. తర్వాత విజయవాడలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సీపీటీ కోచింగ్‌కు జాయిన్ అయ్యాను. సీపీటీ, ఐపీసీసీల్లో జాతీయ స్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించాను.

ఆర్టికల్‌షిప్..
ఆర్టికల్‌షిప్ కోసం డాట్లా అండ్ అసోసియేట్స్‌లో చేరాను. ఆర్టికల్‌షిప్ మూడేళ్లు ఉంటుంది. రెండున్నర ఏళ్ల తర్వాత సీఏ ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది. 2015, నవంబర్‌లో సీఏ ఫైనల్‌కు నాకు అర్హత లభించింది. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాశాను. జాతీయ స్థాయిలో టాప్- 5 ర్యాంకులో ఉంటానని ఊహించాను. రెండో ర్యాంకు రావడం ఆనందాన్నిచ్చింది.

ఇంజనీరింగ్ చేయాలనుకున్నా...
నేను 2011లో మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేశాను. తర్వాత ఇంజనీరింగ్‌లో చేరాలనుకున్నాను. కానీ, అప్పటికే ఇంజనీరింగ్‌కు డిమాండ్ తగ్గింది. దీంతో అన్నయ్య భానుప్రకాశ్ సలహా మేరకు సీఏ చేయాలని నిర్ణయించుకున్నాను.

కష్టాలను దూరం చేయాలనే..
నన్ను, అన్నయ్యను చదివించడానికి నా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. వారిని ఆ కష్టాల నుంచి గట్టెక్కించాలనే కసితో చదివాను. ఇంటర్ నుంచి కష్టపడి చదివాను. సీఏ ఫైనల్ ఎగ్జామ్స్‌కు మూడున్నర నెలల ముందు నుంచి.. రోజుకు కనీసం 12 గంటల పాటు చదివాను.

లక్ష్య సాధన ఇలా..
లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ముఖ్యంగా ఏకాగ్రత చెడకుండా ఉండటం కోసం.. స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాను. వీక్లీ లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకోవడానికి ప్రయత్నించేవాడిని. అలా చేయడం వల్ల.. దృష్టి మరలకుండా ప్రిపరేషన్ ముందుకు సాగింది. అన్నింటి కంటే ముఖ్యంగా మాక్‌టెస్టులు రాయడం వల్ల నా ప్రిపరేషన్‌లోని లోపాలు తెలిశాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాను. ఐసీఏఐ నిర్వహించిన రెండు మాక్‌టెస్టులు రాశాను. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను స్వీయ విశ్లేషణ చేసుకున్నాను. అందులో చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాను.

సమయపాలన కీలకం
సీఏ ఫైనల్ పరీక్షల్లో సమయ నిర్వహణ కీలకం. మూడు గంటల సమయం అసలు సరిపోదు. మాక్‌టెస్టులు రాయడం వల్ల సమయ నిర్వహణ ఎలా చేసుకోవాలో అవగాహన వచ్చింది. అదేవిధంగా మాక్ టెస్టుల ద్వారా వేగాన్ని పెంచుకోగలిగాను. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటవిడుపుగా క్రికెట్ ఆడడం, చూడడం; రాబిన్ శర్మ, యండమూరి వీరేంద్రనాథ్ వంటి వారు రాసిన పుస్తకాలు చదవటం.. వంటివి చేశాను.

సిలబస్‌పై అవగాహన ముఖ్యం
సీఏలో కొన్ని కష్టమైన సబ్జెక్టులు ఉంటాయి. సీఏ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా సీఏ సాధించే క్రమంలో వచ్చే ఒడిదొడుకులను ఎదుర్కోవాలనుకునే ప్రతి ఒక్కరికీ.. సీఏ సాధించాలనే నిబద్ధత, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఒక్కోసారి విఫలమైనా.. నిరాశ చెందకూడదు. ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నించాలి. సాధించాలనే తపన ఉంటే సీఏ పెద్ద కష్టమేమి కాదు. హార్డ్‌వర్క్‌ను నమ్ముకుంటే విజయం దాసోహం అంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది దాన్ని చేరుకోవడానికి అవిశ్రాంతంగా పనిచేయాలి.
లక్ష్యం: మూడేళ్ల పాటు ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. తర్వాత సొంత ప్రాక్టీస్ పెట్టాలనే ఆలోచన ఉంది.

అకడమిక్ ప్రొఫైల్

పదో తరగతి

526/600

ఇంటర్మీడియట్

972/1000

సీపీటీ ర్యాంక్

9

ఐపీసీసీ ర్యాంక్

9

సీఏ ఫైనల్

572/800















#Tags