Govt Jobs: రెండేళ్లలో 50 వేల ఉద్యోగాలు

రానున్న రెండేళ్ల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ప్రజలతో సీఎం పథకానికి అనూహ్య స్పందన వచ్చినట్టు వివరించారు. 1,598 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు.

సాక్షి, చైన్నె: కలైవానర్‌ అరంగం వేదికగా శుక్రవారం ప్రజలతో సీఎం పథకం కార్యక్రమంతో పాటు 1,598 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజలతో సీఎం పథకం మేరకు 2,058 శిబిరాలను ఏర్పాటు చేశామని, తద్వారా 3.50 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామని ఈ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని ప్రకటించారు. కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్‌ కొత్తగా ఎంపికై న వారికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ప్రజలతో సీఎం కార్యక్రమం ద్వారా విన్నవించుకున్న లబ్ధిదారులకు పలు పథకాలను పంపిణీ చేశారు.

బృహత్తర పథకాలతో...
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ, తాము అధికారంలోకి వచ్చినానంతరం చేపట్టిన బృహత్తర పథకాలను గుర్తు చేశారు. ఇందులో మహిళలు, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా మారాయని వివరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ మేరకు దరి చేరాయో తెలుసుకునేందుకే ప్రజల వద్దకు సీఎం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరాలన్న కాంక్షతో విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలబడేది తాము మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. తొలి విడతగా జరిగిన ప్రజలతో సీఎం శిబిరాలు పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని 2 వేల 58 గ్రామ పంచాయతీలలో నిర్వహించామని వివరించారు. రెండో విడతగా అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో శిబిరాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను, ఫిర్యాదులను వెబ్‌ సైట్‌లో పొందు పరిచి, సంబంధిత శాఖలకు పంపించామన్నారు. 30 రోజుల్లో 3 లక్షల 50 వేల మంది ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ శాఖలో 42 వేల 962 మందికి ఇంటి పట్టాలను బదిలీ చేశామని, విద్యుత్‌ బోర్డులో 26 వేల 383 మందికి కొత్త విద్యుత్‌ కనెక్షన్లు, మార్పులు చేశామని వివరించారు. ఈ శిబిరాలను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మరో ప్రత్యేకతగా తమిళనాడు ప్రభుత్వం సెలక్షన్‌ బోర్డు ద్వారా ఎంపిక చేసిన యువతకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను ప్రస్తుతం అందజేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం ఇప్పటి వరకు 60 వేల 567 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందజేశామన్నారు. రానున్న రెండేళ్లలో 50 వేల మందికి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలను అందజేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 10 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. పట్టభద్రులు, యువతకు ప్రభు త్వ ఉద్యోగాలే కాకుండా, పెట్టుబడుల ఆహ్వానం మేరకు నెలకొల్పనున్న పరిశ్రమలోనూ ఉద్యోగాలు దరిచేరనున్నాయని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్‌, ఎం సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ పాల్గొన్నారు.
 

#Tags