MBBS Students Pass Percentage : రికార్డు స్థాయిలో.. 98% మంది విద్యార్థులు పాస్‌.. ఈ నిర్ణయంతోనే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణలో ఫైనలియర్‌ విద్యార్థులు రికార్డు స్థాయిలో పాసయ్యారు. గతేడాది వరకు ఫైనలియర్‌లో 75–80 శాతం మందే ఎంబీబీఎస్‌ పరీక్ష పాసవగా ఈ ఏడాది ఏకంగా 98 శాతం మంది పాసైనట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.

మొత్తం 6 వేల మంది ఎంబీబీఎస్‌ పరీక్ష రాయగా, 127 మంది ఫెయిల్‌ కాగా, మిగిలినవారంతా పాసైనట్లు కాళోజీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది ఫలితాల్లోనూ పెద్ద ఎత్తున పాసయ్యారు. గతం వరకు మొదటి సంవత్సరం ఫలితాల్లో కేవలం 70–75 శాతం మధ్యే పాస్‌ కాగా, ఈ ఏడాది 90 శాతానికి పైగా పాసయ్యారని కాళోజీ వర్గాలు తెలిపాయి. 

➤ Best Course of Intermediate : 'ఇంటర్‌'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?

ఈ సంస్కరణలతో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. 

ఎంబీబీఎస్‌లో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు ఉంటాయి. ఇవి ఎంతో కఠినంగా ఉంటాయి. కాగా గతం వరకు ప్రాక్టికల్స్‌లో తప్పనిసరిగా 50 శాతం, థియరీలోనూ 50 శాతం మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. దీనివల్ల చాలామంది ఫెయిల్‌ అయ్యేవారని కాళోజీ వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ అయ్యేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ విషయంలో ఆయా కాలేజీలు ఉదారంగా వ్యవహరిస్తాయని, ఫీజులు చెల్లించనివారి విషయంలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు చూపిస్తాయనే వాదనలుండేవి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఎంబీబీఎస్‌ పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 

దీనివల్ల అందరికీ పదికి పది మార్కులు..
ఉదాహరణకు ప్రాక్టికల్స్‌లో 40 శాతం మార్కులొచ్చి, థియరీలో 60 శాతం మార్కులొస్తే సరిపోతుంది. అయితే కనీసంగా ఒక దాంట్లో తప్పనిసరిగా 40 శాతం మార్కులు మాత్రం రావాలి. ఒకవేళ ప్రాక్టికల్స్‌లో 42 శాతం మార్కులు వస్తే, థియరీలో 58 శాతం వస్తే సరిపోతుంది. అంతేకాదు ఈసారి 10 మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశ్నలు కూడా తీసుకొచ్చారు. దీనివల్ల అందరికీ పదికి పది మార్కులు వచ్చే అవకాశముంది.ఇలా పేపర్లు ఇప్పుడు అత్యంత సులువుగా చేయడంతో పెద్ద ఎత్తున ఉత్తీర్ణతా శాతం పెరిగినట్లు చెబుతున్నారు. సంస్కరణల వల్ల విద్యార్థులకు వెసులుబాటు కలిగిందనీ, పలు మార్లు రాసే పరిస్థితి నుంచి విద్యార్థులు బయటపడ్డారని చెబుతున్నారు.

➤ Sakshi EAPCET & NEET Mock Test 2024 : సాక్షి మీడియా ఆధ్యర్యంలో ఈఏపీసెట్‌, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

#Tags