PM Vidya Lakshmi Yojana 2024: ‘పీఎం విద్యాలక్ష్మీ’ ద్వారా , హామీ లేకుండా రుణ సౌకర్యం
అమరావతి: దేశంలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. 2023 నాటికి విద్యా రుణాలు రూ.90 వేల కోట్లకు చేరుకున్నాయి. 2023–24లో దేశీయ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ.36,448 కోట్ల మేర విద్యా రుణాలను పంపిణీ చేశాయి. 5,50,993 మంది విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
» గత దశాబ్ద కాలంగా విదేశీ విద్య కోసం రుణాలపై ఆధారపడుతున్న విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. 2012–13లో వీరి సంఖ్య 22,200 కాగా 2020లో ఏకంగా 69,898కి చేరుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ 2022 నివేదిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాలుగు శాతం మాత్రమే రుణాల ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్రలో విద్యా రుణాలకు అధిక డిమాండ్ నెలకొంది.
»రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. 2022లో దాదాపు 7.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ విద్యను ఎంచుకున్నారు.
వరంలా ‘పీఎం విద్యాలక్ష్మీ’
నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు రహిత, హామీ రహిత రుణాన్ని అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్ ప్రకారం 860 విద్యా సంస్థల్లోని సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
» పీఎం విద్యాలక్ష్మీ పథకం కింద ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ కలిగిన ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రూ.7.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కాలర్‌షిలు, వడ్డీ రాయితీలు పొందకపోతే వారికి రూ.10 లక్షల వరకు రుణం అందుతుంది.
మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. పీఎం విద్యాలక్ష్మీ కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో విద్యా రుణం మంజూరవుతుంది.
ఆన్‌లైన్ పోర్టల్ : LINK
ఇదీ చదవండి: Free training in photography
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)