High Court: ఈ తరగతులకి పబ్లిక్‌ పరీక్షలు లేనట్టే

బనశంకరి: స్టేట్‌ సిలబస్‌ ఉన్న పాఠశాలల్లో 5, 8, 9 తరగతులు, పీయూసీ ఫస్టియర్‌ విద్యార్థులకు రాష్ట్రస్థాయి బోర్డు పబ్లిక్‌ పరీక్ష నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలను కర్నాటక హైకోర్టు మార్చి 6న‌ రద్దు చేసింది.

ఎలాగైనా బోర్డు పరీక్షలు జరపాలన్న సర్కారుకు షాక్‌ తగిలింది. స్టేట్‌ సిలబస్‌ ఉన్న పాఠశాలల్లో పై తరగతుల విద్యార్థులకు రాష్ట్రస్థాయి మండలి పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది.

ఏమిటీ విషయం?

సాధారణంగా ఈ తరగతుల వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు పాస్‌ మార్కులు రాకపోయినా తదుపరి తరగతికి పంపించడం ఆనవాయితీ. అలా కాకుండా ఎస్‌ఎస్‌ఎల్‌సీ తరహాలో పబ్లిక్‌ పరీక్షలను జరుపుతారు, వాటిలో పాసైతేనే పై తరగతికి వెళ్లొచ్చు, ఫెయిలైతే మళ్లీ ఆ చాన్సు ఉండదు. దీని వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుందని, ఫెయిలై చదువును విడిచిపెట్టే వారు పెరుగుతారని విద్యావేత్తలు గతంలోనే ఆందోళన వెలిబుచ్చారు.

చదవండి: Madhu Bangarappa: 500 కేపీఎస్‌ పాఠశాలల అప్‌గ్రేడ్‌

వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు..

సర్కారు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల సంఘం హైకోర్టులో కేసు వేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల పాఠ్యాంశాలు వేర్వేరుగా ఉంటాయని, ఉమ్మడిగా పరీక్షలు రాయడం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కష్టమని పిటిషనర్‌ న్యాయవాదులు వాదించారు. విద్యార్థులందరికీ వర్తించేలా బోర్డు స్థాయి పరీక్ష నిర్వహణకు అవకాశం ఇవ్వరాదని మనవిచేశారు.న్యాయమూర్తి జస్టిస్‌ రవి హొసమనితో కూడిన ధర్మాసనం విచారించి, సర్కారు ఉత్తర్వులు సబబు కాదని స్పష్టం చేసింది.

చదవండి: Rudrappa Manappa Lamani: ఈ విద్యార్థుల కోసం ఉచిత వసతి పాఠశాల

ప్రభుత్వ న్యాయవాదికి చుక్కెదురు..

ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ కలికా చేతరిక కూడా పాఠ్యాంశంలో భాగమేనని, సాధారణ పాఠ్యాంశాలతోనే సిద్దం చేశారని, ప్రశ్నాప్రతాల్లో పాఠ్యాంశాల్లో లేని ప్రశ్నలు లేవని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించడానికి అవకాశం కల్పించాలని మనవి చేసినప్పటికీ హైకోర్టు సమ్మతించలేదు. దీంతో ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్ణయించిన బోర్డు పరీక్షలు రద్దయినట్లే. తీర్పుపై ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు హర్షం వ్యక్తంచేశాయి. పరీక్షల పేరుతో పిల్లలను గాభరా పెట్టరాదని తెలిపాయి.

#Tags