NAS Exam: విద్యార్థుల సామర్థ్యాలకు ‘పరీక్ష’..

ఆదిలాబాద్‌ టౌన్‌: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న న్యాస్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల ప్రతిభ తేలనుంది. విద్యార్థులతో పాటు గురువుల బోధన తీరు స్పష్టం కానుంది.

గతంలో జాతీయ స్థాయిలో పది జిల్లాలు చదువులో వెనుకబడగా, అందులో ఆదిలాబాద్‌ జిల్లా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారైనా పరువు దక్కుతుందా అనేది త్వరలో తేలనుంది. జిల్లాలో విద్యా ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి.. చదువులు కుంటుపడుతున్నాయి.. చాలా మంది విద్యార్థులు చదవడం, రాయడం మర్చిపోతున్నారు. అంకెలు సైతం గుర్తించలేకపోతున్నారు.

ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు కేంద్ర విద్యాశాఖ నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (న్యాస్‌) పరీక్ష నిర్వహిస్తోంది. 2017లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్లో దేశంలోనే ‘లో పర్ఫామెన్స్‌’గా ఆదిలాబాద్‌ నమోదైంది. 2021లో నిర్వహించిన పరీక్షలో గతంతో పోల్చితే పర్వా లేదనే విధంగా 34 శాతం మాత్రమే సామర్థ్యం ఉన్నట్టు తేలింది.

జిల్లాలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు కూడా కనీస సామర్థ్యాలు లేకపోవడం సర్కారు బడుల పనితీరుకు అద్దం పడుతుంది. ఈసారైనా కనీసం 50 శాతం మంది విద్యార్థులు సామర్థ్యాలు మెరుగుపర్చుకుంటారనేది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పరీక్షగా మారింది. కలెక్టర్‌ రాజర్షిషా దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు సైతం చేశారు.

సన్నగిల్లుతున్న చదువులు..

జిల్లాలో ప్రాథమికస్థాయి నుంచి ఉన్నత తరగతుల వరకు సర్కారు బడుల్లో చాలా మంది విద్యార్థులు చదువులో వెనుకబడ్డారు. ఉపాధ్యాయుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, మౌలిక వసతులు లేకపోవడం కారణంగా చెప్పుకోవచ్చు. పదో తరగతి విద్యార్థుల్లో సైతం కొంత మందికి చతుర్విద ప్రక్రియలు, రాయడం, చదవడం రాకపోవడం గతంలో నిర్వహించిన న్యాస్‌ ఫలితాల్లో వెల్లడైంది.

ఈ క్రమంలో విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే పూర్తిస్థాయిలో గాడిన పడినట్లు కనిపించడం లేదు. జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయు కూడా లేకపోగా, 186 పాఠశాలలు ఏకోపాధ్యాయులతోనే కొనసాగుతున్నాయి.

ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడితో బోధన జరగడంతో చదువులు కుంటుపడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలల్లో కూడా సబ్జెక్ట్‌ టీచర్ల కొరత వేధిస్తుంది. విద్యార్థులు సక్రమంగా బడికి రాకపోవడంతోనూ చదువుల్లో వెనుకబడిపోతున్నారు.

జిల్లాలో 300 పాఠశాలల్లో పరీక్ష..

2017, 2021 సంవత్సరాల్లో జిల్లాలో న్యాస్‌ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో 3, 5, 8 తరగతుల విద్యార్థులు హాజరయ్యారు. 2017లో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా విద్యలో వెనుకబడిన పది జిల్లాల్లో ఆదిలాబాద్‌ ఒకటి. 2021లో నిర్వహించిన పరీక్షలో 34 శాతం మంది విద్యార్థుల సామర్థ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను నవంబర్‌ 19న దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

అంతకుముందు ఎస్‌సీఈఆర్టీ మూడు విడతలుగా సెప్టెంబర్‌ 10, సెప్టెంబర్‌ 30, నవంబర్‌ 8న మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది. జిల్లాలో దాదాపు 300 పాఠశాలల్లో న్యాస్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో మొత్తం పాఠశాలలు:1,439

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు:739

విద్యార్థుల సంఖ్య:1,35,323

2017లో న్యాస్‌ ఫలితాలు:లోపర్ఫామెన్స్‌ జిల్లా (ఎల్‌పీడీ)

2021లో న్యాస్‌ ఫలితాలు:34 శాతం

మెరుగైన ఫలితాలు సాధిస్తాం..

జాతీయ స్థాయిలో నిర్వహించే న్యాస్‌ పరీక్షలో ఈ సారి మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకముంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మాక్‌ టెస్ట్‌లు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు చేపడుతున్నాం. ఈసారి 3,6,9వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు ప్రైవేట్‌లో చదివే విద్యార్థులకు కూడా పరీక్ష నిర్వహించనున్నాం. 
– ప్రణీత, డీఈవో
 

#Tags