Teachers Transfer: చట్టప్రకారం బదిలీలు చేపట్టండి.. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా అర్హత పాయింట్లను ఇవ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ టీచర్ల మార్గదర్శకాలు–2023 ప్రకారం మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు చేపట్టడానికి చట్టప్రకారం తుది సీనియారిటీ జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

2023, జూలై 3న పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ జారీ చేసిన మార్గదర్శకాలు 2018లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 81కు విరుద్ధమంటూ జనగామ జిల్లా ఘన్‌పూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన వెంకటరమేశ్‌తోపాటు మరో 14 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటివరకు తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (పీజీటీ) సీనియారిటీ జాబితా ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. సర్వీసు, వయసు ఆధారంగా అర్హత పాయింట్లను లెక్కించడానికి కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు ఏకపక్షం, చట్టవిరుద్ధమన్నారు.

చదవండి: Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

2012, ఫిబ్రవరి 6 నాటి నోటిఫికేషన్‌కు అనుగుణంగా జూన్‌ 2013లో నియామకం అయిన వారితో సమాన అర్హత పాయింట్లను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చట్టప్రకారం బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్, మోడల్‌ స్కూల్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.   

#Tags