PV Narsimha Rao: గురుకుల విద్యకు నాంది పలికిన పీవీ.. తొలి బ్యాచ్‌ విద్యార్థి ఈ ఐపీఎస్‌ అధికారి

సంస్థాన్‌ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌లోని గురుకుల పాఠశాలను దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1971లో ప్రారంభించారు.

భారత దేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల ఇది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గురుకుల విద్యా వ్యవస్థకు నాందిపలికారు. పీవీ నర్సింహారావుకు ‘భారత రత్న’ వచ్చిన నేపథ్యంలో ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సర్వేల్‌ గ్రామానికి చెందిన సర్వోదయ నాయకుడు, గాంధేయవాది మద్ది నారాయణరెడ్డికి పీవీతో సన్నిహిత సంబంధం ఉంది.

చదవండి: Bharata Ratna: పీవీ నరసింహారావుకు భారతరత్న.. పీవీతో పాటు మ‌రో ఇద్దరికి..

అ సంబంధంతో స్వతంత్ర భారత దేశంలో మొట్ట మొదటి గురుకుల విద్యాలయం ఇక్కడ ఏర్పాటైంది. గురుకుల పాఠశాలకు మద్ది నారాయణరెడ్డి తన భూమిని విరాళంగా ఇచ్చారు. సర్వేల్‌ నడిబొడ్డున ఉన్న 44 ఎకరాల స్థలాన్ని, సర్వోదయ ఆశ్రమ భవనాలను నారాయణరెడ్డి గురుకులానికి అప్పగించారు. పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రి హోదాలో 1971 నవంబర్‌ 23న సర్వేల్‌ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గురుకుల వ్యవస్థకు సర్వేల్‌ గురుకుల విద్యాలయం నాంది. ఈ విద్యాలయంలో చదివిన అనేక మంది ఉన్నత ఉద్యోగాల్లో, హోదాల్లో స్ధిరపడ్డారు.

చదవండి: Lakshadweep History: లక్షద్వీప్‌పై పాకిస్తాన్ కన్ను.. లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైందంటే..

ఐపీఎస్‌ అధికారి మల్లారెడ్డి తొలి బ్యాచ్‌ విద్యార్థి

సర్వేలులో ప్రభుత్వ గురుకుల విద్యాలయం ఏర్పడిన తర్వాత తొలి బ్యాచ్‌లో బి.మల్లారెడ్డి విద్యనభ్యసించారు. ఈయన ఐపీఎస్‌ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ట్రాన్స్‌కో జేఎండీగా (విజిలెన్స్‌) సేవలు అందిస్తున్నారు.

#Tags