General V Madhusudan Reddy: ఎన్‌సీసీ బలోపేతమే లక్ష్యం.. ప్ర‌తి జిల్లాల్లో ఈ అకాడమీ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో ఎన్‌సీసీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎన్‌సీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలోని 32 తెలంగాణ బెటాలియన్‌ యూనిట్‌ కార్యాలయాన్ని సెప్టెంబ‌ర్ 12న‌ ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఎయిర్‌పోర్టు మైదానంలో ఎన్‌సీసీ అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌సీసీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్‌ యూనిట్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 10 నుంచి 15 ఎకరాల్లో అకాడమీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబ‌ర్ 23న ఢిల్లీలో ఎన్‌సీసీ జాతీయస్థాయి సమావేశంలో అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన అంశం పరిగణలోనికి తీసుకోనున్నట్లు తెలిపారు.

చదవండి: NCC.. దేశ సేవకు మేము సైతం..! ఎన్‌సీసీ క్యాడెట్ల సర్టిఫికెట్‌ A, B, C ప్రయోజనాలు ఇవే..

అలాగే కుమురంభీం జిల్లాలోనూ యూనిట్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్‌సీసీ నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దిశగా ఉన్నతాధికారులకు సైతం నివేదించామని, త్వరలోనే ఎన్‌సీసీలో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

కేడెట్ల సంఖ్యకు అనుగుణంగా క్యాంపుల నిర్వహణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ యూనిట్‌ పనితీరును కొనియాడారు. అంతకుముందు శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్‌)లో కేడెట్లను కలిసి, మొక్క నాటారు. ఇందులో కల్నల్‌ సంజయ్‌ గుప్తా, కల్నల్‌ సునీల్‌ అబ్రహం, గ్రూప్‌ కమాండర్‌ కౌస్తవ్‌ మహంతి, కల్నల్‌ వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags