TS CPGET: ఆర్ట్స్‌ కోర్సుల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఓయూ క్యాంపస్‌ ఆర్ట్స్‌ కాలేజీలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఎంఏ కోర్సుల్లో ప్రవేశం పొందినట్లు టీఎస్‌–సీపీజీఈటీ కన్వీనర్‌ పాండురంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
టీఎస్‌–సీపీజీఈటీ కన్వీనర్‌ పాండురంగారెడ్డి

 పీజీ ప్రవేశ పరీక్షలకు గతంలో ఎన్నడూలేని విధంగా 418 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 234 మందికి సీట్లు కేటాయించామని, మొదటి కౌన్సెలింగ్‌లో 128 మంది విద్యార్థులు ఆర్ట్స్‌ ఎంఏ కోర్సుల్లో చేరినట్లు ఆయన వెల్లడించారు. కాగా, టీఎస్‌ సీపీజీఈటీ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 23న సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. రెండో జాబితాలో సీటు లభించిన విద్యార్థికి మొదటి జాబితాలో సాధించిన సీటు రద్దు అవుతుందన్నారు.

చదవండి: TSPSC Group 4 Merit List: అక్టోబర్ చివరి వారంలో గ్రూప్-4 మెరిట్ జాబితా?

రాష్ట్రంలోని 8 వర్సిటీల్లోని 50 వేల సీట్లకు మొదటి విడతలో 10 వేల భర్తీ అయినట్లు, రెండో విడతకు 40 వేల సీట్లకు గాను 20 వేలమంది అభ్యర్థులు ఆప్షన్స్‌ ఇవ్వగా అందులో 16 వేల మందికి రెండో విడతలో సీట్లను కేటాయించనున్నట్లు వివరించారు. 23న సీఏపీ, దివ్యాంగుల అభ్యర్థుల జాబితా, ఎన్‌సీసీ కోటాలో సీటు సాధించిన విద్యార్థుల జాబితాను ఈనెల చివర్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో బీఈడీ, బీపీఈడీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల కానందున ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు వచ్చే నెలలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. 

#Tags