Jobs: నిరుద్యోగ యువతకు మెండుగా ఉపాధి

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ పరిశ్రమలకు ఆలవాలంగా మారుతోంది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ బాసటగా నిలుస్తోంది.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ‘ఉద్యమ్‌ పోర్టల్‌’ ఆధారంగా 2024 జూన్‌ 12 వరకు 75,834 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు అధికా రిక గణాంకాలు చెబుతున్నాయి.


ఇటీవలే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌ మైలారం గుట్టల్లో 200 పరిశ్రమల ఏర్పాటుకు ఉద్దేశించిన ఇండస్ట్రియల్‌ పార్కును మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క శంకుస్థాపన చేశారు. దీంతో రానున్న రోజుల్లో వేలాది మంది యువత ఉపాధికి అడుగులు పడినట్టేనన్న చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక తాజా గణాంకాలు కూడా ఈ విషయాన్నే వెల్లడించాయి.

చదవండి: Nikita Ketawat: హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తెకు ఆరు ఉద్యోగాలు

మెగా టెక్స్‌టైల్‌ పార్కుపైనా ఆశలు..

వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో గతంలోనే 22 కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నారు. దశల వారీగా అవి పరిశ్రమల ఏర్పాటుకు వస్తున్నాయి. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌ కేంద్రంగా ఉన్న గణేశా ఎకోటెక్‌ కంపెనీ ప్లాస్టిక్‌ నుంచి దారం (యార్న్‌ ) తయారుచేస్తోంది.

పిల్లల దుస్తుల తయారీ కేరళ కేంద్రంగా ఉన్న కై టెక్స్‌ కంపెనీ, దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌ వన్‌ కంపెనీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంకోవైపు ఈ పార్కు పీఎం మిత్ర పథకం కింద ఎంపిక కావడంతో కేంద్రం నుంచి నిధులు వస్తే మౌలిక వసతుల్లో మరింత వేగం పెరగనుంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న మామునూరు విమానాశ్రయం మొదలైతే మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కనిపిస్తోంది.

అలాగే, హనుమకొండ, జనగామ జిల్లాలోని వస్త్రపరిశ్రమలతో పాటు ఐటీ, ఫార్మా, ఇతర రంగాల పరిశ్రమలు వందల సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ఫలితంగా వేలాది మంది యువకులు స్థానికంగా ఉంటూనే ఇక్కడా ఉద్యోగాలు చేస్తున్నారు. త్వరలోనే ములుగులో కూడా ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో అక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

#Tags