Soumya Mishra IPS: శిక్ష కాదు.. శిక్షణ ఇచ్చాం.. అక్షర జ్ఞానం లేనివారు గోల్డ్‌మెడల్స్‌ సాధించారు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కారణాలతో జైళ్లకు వచ్చిన వారికి శిక్షకు బదులుగా శిక్షణ ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.

క్షణికావేశంలో చేసిన తప్పులకు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా, జైళ్లలో ఉన్న వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విడుదలైన ఖైదీలంతా సమాజంలో మోడల్‌ సిటిజన్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. జూలై 4న‌ క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల సందర్భంగా చర్లపల్లి సెంట్రల్‌ జైల్లో ‘మార్గదర్శనం..ఉపాధి కల్పన’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

‘రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన 2013 మంది ఖైదీల్లో 205 మంది జీవిత కాలం శిక్ష పడిన వారు ఉండగా, అందులో 35 మంది మహిళలు ఉన్నా రు. వీరందరికీ జైల్లో వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చాం. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టైలరింగ్, కంప్యూటర్, తదితర రంగాల్లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాం.

చదవండి: Ministry of Home: ఖైదీల్లో సత్ప్రవర్తనే లక్ష్యంగా.. త్రైపాక్షిక ఒప్పందం

అక్షర జ్ఞానం లేనివారిని సైతం డిగ్రీ, పీజీ చదివించాం. కొందరు గోల్డ్‌ మెడల్స్‌ సంపాదించారు. 33% మంది ఖైదీలకు ఉపాధి చూపించాం. 70 మంది ఖైదీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్‌ బంకుల్లో ఉద్యోగాలు ఇచ్చాం. 10 మందికి టైలరింగ్‌ మిషన్లు అందజేశాం..’అని సౌమ్యా మిశ్రా తెలిపారు. 

కర్మాగారాలుగా కారాగారాలు 

జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు మాట్లాడుతూ.. ‘కారాగారాలను కర్మాగారాలుగాను, పరివర్తనాలయాలగాను, విద్యాలయాలుగాను, దేవాలయాలుగాను మార్చాం. 10 నుంచి 15 ఏళ్ల పాటు జైళ్లలో ఉండి బయటకు వస్తున్న వారు తమ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’అని అన్నారు.

ఖైదీల విడులకు సంబంధించి గత నాలుగేళ్లుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయని జైళ్ల శాఖ ఐజీ వై.రాజేష్‌ పేర్కొన్నారు. ‘క్షమా భిక్ష దస్త్రాలు తీసుకుని వెళ్లినప్పుడు.. జైళ్లలో ఉన్న ఖైదీల్లో మార్పు వచ్చిందంటున్నారు. వారు మారిపోయారా? ఎలాంటి వ్యక్తులను రిలీజ్‌ చేస్తున్నారు? అని అడిగారు.

చదవండి: Iran sentences women journalists: ఇరాన్‌లో మహిళా జర్నలిస్టులకు జైలు శిక్ష

మార్పు కనిపిస్తోందని ఉన్నతాధికారులకు చెప్పాం..’అని తెలిపారు. పెద్దపెద్ద తప్పులు చేసిన వారిని రిలీజ్‌ చేయడం లేదని. క్షణికావేశంలో పొరపాట్లు చేసి దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు.

కార్యక్రమంలో హైదరాబాద్, వరంగల్‌ డీఐజీలు డి.శ్రీనివాస్, ఎం.సంపత్, చర్లపల్లి, హైదరాబాద్, వరంగల్‌ కేంద్ర కారాగారాల ఎస్పీలు సంతోష్‌కుమార్, శివకుమార్‌ గౌడ్, కళాసాగర్, విడుదలైన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  

#Tags