Invention: ఆవిష్కరణ మీది.. పేటెంటూ మీదే!
సాంకేతిక విద్యాసంస్థల్లో చాలామంది విద్యార్థులు కొత్త పరికరాలు, వివిధ రకాల యాప్స్‌ను తయారు చేసి ప్రదర్శనలిస్తుంటారు. చాలామంది వాటికి మేధో హక్కులు (పేటెంట్స్) పొందకుండా వదిలేస్తున్నారు. ఫలితంగా వారి ఆవిష్కరణలన్నీ కార్యరూపం దాల్చడం లేదు. పైగా కొన్ని సంస్థలు వాటిని కాపీ కొట్టి మార్కెట్‌లోకి విడుదల చేసి లాభాలు పొందుతున్నా అసలైన ఆవిష్కర్త ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి చెక్ పెడుతూ నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ) నూతన ఆవిష్కర్తలకు చేయూత అందిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో గుర్తింపు అసలైన ఆవిష్కర్తలకే దక్కాలంటే కచితంగా పేటెంట్ పొందాలని పిలుపునిస్తోంది.
మేధో సంపత్తిని విశ్వవ్యాప్తం చేసేలా...
కొత్త ఆవిష్కరణలు వాటిని రూపొందించిన వారికి ఆస్తులతో సమానమని ఎన్‌ఆర్‌డీసీ చెబుతోంది. వారి ఆలోచనలతో తయారు చేసిన పరికరాల్ని తక్కువగా అంచనా వేస్తే సమాజం చాలా నష్టపోతుంది. ఈ పరిస్థితులు తలెత్తకుండా ఎన్‌ఆర్‌డీసీ చర్యలు చేపడుతోంది. ఆవిష్కరణలకు పేటెంట్ కలి్పస్తోంది. విద్యార్థులు తమ మేధని ఉపయోగించి తయారు చేసే పరికరాలే విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తాయి. కానీ.. వీటిని ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎన్‌ఆర్‌డీసీని సంప్రదిస్తే విజయం వారి సొంతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వస్తువులకు పేటెంట్, ట్రేడ్‌మార్క్, డిజైన్, జియోగ్రాఫికల్ సూచనలు మొదలైన మేధో సంపత్తి హక్కుల్ని సృష్టించడం, వాటిని పరిరక్షించడం, ఆవిష్కర్తల్ని ప్రోత్సహించేందుకు ఎన్‌ఆర్‌డీసీ చేయూత అందిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సాంకేతికతని అందుబాటులోకి తీసుకొస్తోంది.
226 పేటెంట్స్.. 75 ట్రేడ్‌మార్క్‌లు
విశాఖలోని ఐటీ హిల్–3 కేంద్రంగా ఎన్‌ఆర్‌డీసీకి చెందిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ అందుబాటులో ఉంది. మూడేళ్లలో ఇప్పటివరకూ 226 పేటెంట్లకు సహకారం అందించింది. మరో 75 ట్రేడ్‌మార్క్‌లని కేటాయించింది. 45 ఇన్నోవేటివ్ టెక్నాలజీలను వివిధ ప్రముఖ సంస్థలకు బదిలీ చేసి నూతన ఆవిష్కర్తల్ని ప్రోత్సహించింది.
పేటెంట్ పొందిన ఆవిష్కరణలివే..
సముద్రాలకు సంబంధించిన రక్షణ సాంకేతికతల్ని వివిధ సంస్థలు సిద్ధం చేస్తున్నాయి. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా సముద్రాన్ని అంచనా వేసేందుకు రోజుకో టెక్నాలజీ అవసరమవుతోంది. విభిన్న రీతుల్లో ఉపయోగపడే వివిధ టెక్నాలజీలను ఇటీవలే చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన సంస్థలకు అందించేందుకు ఎన్‌ఆర్‌డీసీ సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా ఎన్‌ఐఓటీ తయారు చేసిన 8 టెక్నాలజీలకు పేటెంట్ కలి్పస్తూ.. వాటిని ఎల్ అండ్ టీ సంస్థకు ఎన్‌ఆర్‌డీసీ బదిలీ చేసింది. ఇందులో నది, సరస్సు, చెరువు, సముద్రం వంటి నీటి వనరుల్లో రిమోట్ డేటా సేకరణకు ఉపయోగించే రోబో కోస్టల్ అబ్జర్వ్, సాగర పరిస్థితులపై సర్వే, పర్యవేక్షణను ఏకకాలంలో చేయగల రోబో బోట్ టెక్నాలజీ, సముద్రంలో పరిస్థితుల్ని అంచనా వేసే టైప్11 మెట్ ఓషన్ బ్యూయ్ సిస్టమ్, ఉపరితల తరంగాలు, ప్రవాహాల్ని సులభంగా కొలవగలిగే టైప్–2 మెట్ ఓషన్ బ్యూయ్ సిస్టమ్, టైప్–1 ఇండియన్ సునామీ బ్యూయ్ సిస్టమ్, టైప్–2 ఇండియన్ సునామీ బ్యూయ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. 2 వేల మీటర్ల లోతులో సముద్ర ఉష్ణోగ్రతలు, లవణీయత, తరంగాల తీవ్రతను రియల్ టైమ్‌లో అందించగలిగే అటానమస్ అండర్ వాటర్ ప్రొఫెల్లింగ్ డ్రిఫ్టర్, సముద్రాల ఉపరితలంలో ప్రవాహాలు, వాతావరణంలో వైవిధ్యం, గాలుల వేగాన్ని అంచనా వేయగలిగే ఇన్‌సాట్ కమ్యూనికేషన్ ఓషన్ డ్రిఫ్టర్ కూడా ఇందులో ఉన్నాయి.
మీ ఆలోచనలకు మా సహకారం
విభిన్న ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసుకోవాలనుకునే యువతకు ఎన్‌ఆర్‌డీసీ సహకారం అందిస్తుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే విద్యార్థుల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఐడియాలతో తయారు చేసిన పరికరాలు మార్కెట్‌లోకి వెళ్లేందుకు ట్రేడ్ మార్క్ సౌకర్యాన్ని అందిస్తున్నాం. www.nrdcindia.com ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే.. విద్యార్థులకు శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవలే బెస్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్‌గా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నాం.
– డాక్టర్ బీకే సాహూ, రీజనల్ హెడ్, ఎన్‌ఆర్‌డీసీ