Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Civils Topper Srija Success Story: ఎంబీబీఎస్ పూర్తవ్వగానే తండ్రి శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. సివిల్స్‌లో తాను 100 లోపు ర్యాంక్‌ను ఊహించానని ఇంత మంచి ర్యాంకు వస్తుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీజ తన కెరియర్ విశేషాలను ‘సాక్షి’కి వివరించారు.
నా చిన్న తనంలోనే..
తన చిన్న తనంలోనే అమ్మ నర్సుగా సేవలందిస్తున్న అంశాలు తనను ప్రేరేపించడంతో ఎంబీబీఎస్ చేసి డాక్టరయ్యానని శ్రీజ తెలిపారు.
విద్యాభ్యాసం ఇలా..
రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్‌లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో, ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ(2019)లో పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు.
నా కృషి వీరికే..
డాక్టర్‌గా సేవలందించాలనుకున్న తనకు అమ్మతో పాటు నాన్న ప్రోత్సాహం తోడైందని..అక్కడ నుంచి తన సేవలను కొద్ది మందికి కాకుండా మరింత మందికి అందించాలన్న ఆశయంతో సివిల్స్ వైపు అడుగులు వేసినట్లు తెలిపారు. మహిళ ఉన్నత చదువు చదివితే ఆ ప్రభావం కుటుంబపై ఎలా చూపుతుందో తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతతోపాటు విద్యాభివృద్ధికి కృషిచేస్తానన్నారు.
ఇలా ముందుకు సాగితే..
ఎవ్వరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, అందరూ సమర్థులేనని గుర్తించి ముందుకు సాగాలని శ్రీజ పేర్కొన్నారు. ఎవ్వరి ప్రోత్సా హం కోసం ఎదురు చూడొద్దని.. ఎవరికి వారు తమకు తాముగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి వాటినైనా సాధించుకోవచ్చన్నారు.
మొదటి ప్రయత్నంలోనే..
చదువులో చురుగ్గా ఉండే శ్రీజ తన తండ్రి కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సాధించడంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా కూతురును ఐఏఎస్ చదివించాలనే కోరిక తండ్రిలో బలపడింది. అదే విషయాన్ని శ్రీజకు చెప్పి ఒప్పించాడు.
అతి సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్ వరకు..
అతి సాధారణ కుటుంబ నుంచి వచ్చిన శ్రీజ సివిల్స్ బెస్ట్ ర్యాంక్ సాధించడంతో శ్రీనివాస్ స్నేహితులు చిలుకానగర్ డివిజన్ సాయినగర్‌కాలనీలో సంబరాలు చేసుకుంటున్నా రు. 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన శ్రీనివాస్ పలు ఆటోమొబైల్ షోరూమ్స్‌లో పని చేశారు. ప్రస్తుతం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలో సాయినగర్‌లో డబుల్ బెడ్ రూం ఇంటిలో అద్దెకుంటున్నారు. శ్రీజకు ఓ సోదరుడు సాయిరాజ్ కూడా ఉన్నాడు. అతను బీబీఏ పూర్తి చేశాడు.