UPSC Civils 1st Ranker Aditya Srivastava Story : సివిల్స్‌లో నా నెం-1కి ప్లాన్ ఇదే.. శ్రీవాత్సవ నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఇవే..
ఐపీఎస్ టూ ఐఏఎస్..
డబ్బే అంతిమ ప్రేరణ కాదని... అట్టడుగు స్థాయి వారికి ప్రభావం చూపేలా మన జీవితం కొనసాగాలని చెబుతున్నాడు శ్రీవాత్సవ. ఈయన ఇప్పటికే ఐపీఎస్ సాధించాడు. 2022లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌ను ఎంచుకున్నాడు. హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూనే మళ్లీ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. 2023లో అతడిని అత్యున్నత స్థానం వరించింది. అతని అంకితభావం, పట్టుదల ఆయనకు ఈ విజయాన్ని అందించాయి. వ్యక్తి ఏదైనా సాధించాలంటే అతనికి కుటుంబం మద్దతు చాలా అవసరం. ఆదిత్యకు కుటుంబం నుంచి ఎంతో ప్రోత్సాహం లభించింది.
అత్యంత ముఖ్యమైన పనులను..
విద్యార్థులు పాఠశాల దశ నుంచే కమ్యూనికేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతున్నారు ఆదిత్య శ్రీవాత్సవ. ఇది జీవితంలో అవసరమైన నైపుణ్యం. ఏది సాధించాలన్నా కూడా కమ్యూనికేషన్స్ ఇప్పుడు అత్యవసరంగా మారాయి. సమయ నిర్వహణ అనేది కూడా విద్యార్థులకు ఉండాల్సిన ముఖ్య సుగుణం. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేసేలా చేస్తుంది. సమర్థవంతమైన సమయ నిర్వాహణ చేసే విద్యార్థులు జీవితంలో ఏదైనా త్వరగా సాధించగలరని యూపీఎస్సీ టాపర్ అభిప్రాయం. విమర్శనాత్మక ఆలోచనలు కూడా విద్యార్థులకు ప్రయోజనాలను అందిస్తాయి. వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. వృత్తిపరమైన జీవితంలోని సవాళ్లను ఈ విమర్శనాత్మకమైన ఆలోచనలు త్వరగా సాల్వ్ చేస్తాయి. విద్యార్థులకు సృజనాత్మకత చాలా అవసరం ఇది.
☛ UPSC Results 2024: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో టాప్–25 ర్యాంకర్లలో ఉన్న మహిళలు వీరే!!
హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్..
యూపీఎస్సీ టాపర్ ఆదిత్య నుంచి మన విద్యార్థులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అతను చెప్పిన దాని ప్రకారం విద్యార్థులు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయడమే మంచిది. కష్టపడి పనిచేయడం చాలా కీలకం అని చెబుతున్నాడు. కేవలం చదువులో పైనే మాత్రమే దృష్టి పెడితే మెదడు మొద్దుబారిపోతుందని... క్రికెట్, సంగీతం వంటి ఎంటర్టైన్మెంట్ కూడా జీవితానికి ఉండాలని చెబుతున్నాడు. పరీక్షలకు ముందు మాత్రం అలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిలిపివేసి పూర్తిగా చదువు పైనే దృష్టి పెట్టాలని చెబుతున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. నాయకత్వం అనేది ముఖ్యమైన వృత్తిపరమైన నైపుణ్యం. ఈ నైపుణ్యం విద్యార్థులు తమపై తాము నమ్మకాన్ని పెంచుకునే విధంగా చేస్తుంది. ఇతరులపై ఆధారపడే అవకాశాలను తగ్గిస్తుంది.
ఫెయిల్యూర్‌తో మొదలై..
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్‌సీ పరీక్షలో టాప్-1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ఇది చాలదు అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్‌గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.
ఈ బలమైన కోరికతోనే..
ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులలో ఒకటైన గోల్డ్‌మాన్ శాక్స్‌తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టేవాడు కాదేమో.పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది.
ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్.. కానీ..
ఉద్యోగాన్ని బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడం ప్రారంభించాడు. ఎందుకొచ్చిన రిస్క్ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు.
2021 పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్-డెప్త్ ఎనాలసిస్‌తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్‌కుప్రాధాన్యత ఇచ్చాడు.
చేసిన తప్పులను..
2022 యూపీఎస్‌సీ ఎగ్జామ్‌లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్‌లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్‌సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. 'టాప్ 70లో ఉండాలి' అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. సివిల్స్‌లో విజయం సాధించడానికి సెల్ఫ్-మోటివేషన్ అనేది ముఖ్యం అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ.
ఎడ్యుకేషన్ :
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్‌లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్‌సీ ప్రిపేరేషన్‌కు ఉపయోగపడ్డాయి. 'కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్'లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్‌ను రూపొందించుకున్నాడు.
నోటి నుంచి తరచుగా..
కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్.. రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను.
సివిల్స్ ఫలితాలు రాగానే ఆదిత్య ఉద్వేగానికి లోనై..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో టాప్-1 ర్యాంక్ సాధించిన ఆదిత్య జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు.. గురించి ఆయన తల్లిదండ్రులు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాపా.. ఇది చాలా ఎక్కువ.. సివిల్స్ ఫలితాలు రాగానే ఉద్వేగానికి లోనై ఆదిత్య తన తండ్రికి ఫోన్ అన్న మాటలివి. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ఇంట్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు ఆనంద బాష్పాలు వదులుతూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఆదిత్య తన తండ్రి అజయ్ శ్రీవాస్తవకు ఫోన్ చేసిన ముందు.. ఆయన యూపీఎస్సీ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేశారు. అప్పటికీ రిజల్ట్స్ రాలేదు. దీంతో ఆయన కొంత ఆందోళనకు గురయ్యారట. ఆ తర్వాత ఆదిత్య వాట్సాప్ కాల్ చేసి తనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చిందని చెప్పారట. యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో మొదటి ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవకు మొత్తం 2025 మార్కులకు గాను 1099 మార్కులు వచ్చాయి.
కుటుంబ నేపథ్యం :
ఆదిత్యకు ఒక సోదరి ఉన్నారు. ఆమె కూడా కూడా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆదిత్యలాగే అయన సోదరి సైతం ఐఏఎస్ కావాలని కలలు కంటున్నారు. ఆదిత్య తండ్రి అజయ్ శ్రీవాస్తవ కేంద్ర ఆడిట్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి అభా శ్రీవాస్తవ గృహిణి.
ఆదిత్య శ్రీవాస్తవ తల్లి అభా శ్రీవాస్తవ మాటల్లో..
మా అబ్బాయి ఐఏఎస్ కావాలని కోరుకున్నాం. సివిల్స్ ర్యాంకుల్లో ఆదిత్య మొదటి ఐదు స్థానాల్లో ఉంటాడని భావించాం. కానీ ఫలితాల్లో ఆదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించడం చూసి మేము నమ్మలేకపోయాం. ఆదిత్య చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. 10, 12వ తరగతుల్లో మంచి ర్యాంకులు సాధించాడు. ఆ తర్వాత ఐఐటీకి ఎంపికయ్యాడు. ఐఐటీ కాన్పుర్‌లో చదువు పూర్తైన తర్వాత ఏడాదిన్నర ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఆదిత్యకు స్ఫూర్తి ఈయనే..
అంతకుముందు తన కుమారుడు ఆదిత్యకు యూపీఎస్సీలో 236 ర్యాంక్ వచ్చి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడని ఆదిత్య తండ్రి అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అయినా అప్పుడు ఆదిత్య సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్నానని, ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆదిత్య అన్నారని చెప్పారు. నా కొడుకు చిన్నప్పటి నుంచి మంచి కమిట్మెంట్తో ఉండేవాడు. అందుకే మేం సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించాం. ఆదిత్య మేనమామ ఐఏఎస్ అధికారి. ఆయన నుంచి ఆదిత్య ప్రేరణ పొందాడు.
ఆదిత్యకు ఇష్టమైనవి..
చదువుతో పాటు క్రికెట్ ఆడటం, చూడటం, పాటలు వినడం ఆదిత్యకు ఇష్టం. ఈ హాబీలతో పాటు డైనోసార్ల గురించి సమాచారాన్ని సేకరించడం, పరిశోధించడం ఆదిత్యకు ఇష్టం. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే యువతకు ఆదిత్య శ్రీ వాస్తవ సక్సెస్ సక్సెస్ జర్నీ ఎంతో స్ఫూర్తిధాయకం.