Ila Tripathi IAS Success Story : ఆ టైమ్‌లోనే ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వాల‌నుకున్నా.. కానీ మా అమ్మ, నాన్న నా కోసం...

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్‌ ప‌రీక్ష‌ల్లో.. మూడు ద‌శ‌లు దాటి ఉద్యోగం సాధించాలంటే.. అనుకున్నంత ఈజీగా కాదు. ఇందులో విజ‌యం సాధించాలంటే.. ఎంతో ప్ర‌ణాళిక ఉండాలి.

ఈ నేప‌థ్యంలో... ప్ర‌స్తుత నల్లగొండ కలెక్టర్‌ త్రిపాఠి యూపీఎస్సీ సివిల్స్ కోసం ఎలా చ‌దివారు..? ఈమె కుటుంబ నేప‌థ్యం ఏమిటి ? మొద‌లైన విష‌యాలపై త్రిపాఠి ఐఏఎస్‌ ప్ర‌త్యేక స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
మాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లక్నో. మా నాన్న ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌లో ఫారెస్ట్‌ సర్వీసులో పనిచేశారు. తరువాత డిప్యూటేషన్‌పై కర్నాటకలో పనిచేశారు. ఏం చదువుకుంటే ఎక్కువగా ప్రజలకు సర్వీసు చేయవచ్చని చిన్నప్పటి నుంచి నాన్నను అడిగేదాన్ని. కలెక్టర్‌ అయితే ప్రజలకు మేలు చేయవచ్చని, ఎక్కడున్నా నిజాయితీగా పనిచేయాలని ఎప్పుడూ చెప్పేవారు. నాన్ననే స్ఫూర్తిగా తీసుకొని చదువుకున్నా.

నా ఎడ్యుకేష‌న్ :

నేను ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 2013లో బీటెక్‌ పూర్తి చేశాను. ఆ తరువాత లండన్‌ వెళ్లాను. అక్కడ లండన్‌ స్కూల్‌ ఎకనామిక్స్‌లో ఏడాది చదువుకున్నా. 

నేను చేసిన ఉద్యోగాలు ఇవే...
నా చ‌దువు పూరైన వెంటనే జాబ్‌ వచ్చింది. రెండున్నరేళ్లు మైక్రోసేవ్‌ కంపెనీకి చెందిన ఈక్విటీ బ్యాంక్‌లో ఫైనాన్షియల్‌ కన్షల్టెంట్‌గా జాబ్‌ చేశా. ఆరు నెలలు ఢిల్లీలో, ఆరు నెలలు లక్నోలో ఉండాల్సి వచ్చేది. 

ఆ మాట‌ల వ‌ల్లే.. నేను సివిల్స్ వైపు..

నా చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని బీటెక్‌ చేస్తున్నప్పుడే సివిల్స్‌ సాధించాలని అనుకున్నా. జాబ్‌ చేస్తూనే 2015 జూన్‌ నుంచి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం మొదలుపెట్టా. రెండో అటెంప్ట్‌(2017)లో సివిల్స్‌ సాధించా. మా అక్క కోసం అమ్మ గిరిజ త్రిపాఠి టీచర్‌ ఉద్యోగాన్ని త్యాగం చేస్తే, సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యాన్ని నాన్న పీఎన్‌ త్రిపాఠి నాలో నింపారు. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో భర్త భవేశ్‌మిశ్రా ఎంతో ప్రోత్సహించారు. 

ప్రభుత్వ ఆసుపత్రిలోనే త‌ను..

ఐఏఎస్‌ త్రిపాఠి 2017 బ్యాచ్‌కు చెందిన వారు. ఈమె ములుగులో పనిచేస్తున్నప్పుడు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన ఐఏఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు. అక్కడి నుంచి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లిన ఆమె, ఇటీవల నల్లగొండ కలెక్టర్‌గా వచ్చారు. ఈ

నా భ‌ర్త కూడా..
నా భర్తది ఢిల్లీ. నాకు రెండేళ్లు సీనియర్‌. అప్పటికే ఆయన ఐఏఎస్‌. బిహార్‌ క్యాడర్‌లో బాగల్‌పూర్‌లో పనిచేస్తున్నప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. నేను సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ఎలా ప్రిపేర్‌ కావాలి, బుక్‌ లిస్ట్‌ కావాలని ఆయనకు మెయిల్‌ పంపించాను. అందుకు ఆయన స్పందించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఆయన సర్వీసులో ఉన్నా నా కోసం నోట్స్‌ తయారు చేసేవారు. గైడెన్స్‌ ఇచ్చేవారు. సెలక్షన్‌ తర్వాత నేను సెవంటీ వన్‌ టూ ఫిఫ్టీ వన్‌ పుస్తకాన్ని రాశాను. ప్ర‌స్తుతం సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది.

మాది ప్రేమ వివాహాం :
సివిల్స్‌ ప్రిపరేషన్‌ గైడెన్స్‌ నుంచి మా మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లపాటు నా ప్రిపరేషన్‌ కొనసాగింది. మొత్తానికి నాలుగేళ్ల తరువాత మేం పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు ఉన్నాడు.

నా ల‌క్ష్యం ఇదే..

అక్షరాస్యత నా కల. వారు బాగా చదువుకోవాలి. మా అమ్మానాన్న చదువుకున్నారు. అమ్మ టీచర్‌. మా అక్కా నేను బాగా చదువుకున్నాం. మాలాగే మహిళలంతా బాగా చదువుకొని ఎదగాలి. మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నదే నా లక్ష్యం. వారికోసం ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తా. 

నేను నా బిడ్డకు ఏ పోషకాహారం అందిస్తానో.. వీరికి కూడా..
నేను ములుగులో ఉన్నప్పుడు బాబు పుట్టాడు. ఆ సమయంలో ములుగు ప్రాంత మహిళల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉండేది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఇంట్లో నేను నా బిడ్డకు ఏ పోషకాహారం అందిస్తానో దానినే వారికి కూడా అందించాలని నిర్ణయించుకున్నా. 13 రకాల చిరు ధాన్యాలతో ‘పోషణ్‌ పోట్లీ’ అనే కార్యక్రమం అమల్లోకి తెచ్చా. పాలిచ్చే తల్లులు, ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లల ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడింది. తక్కువ బరువు ఉన్న పిల్లలకు అందించడం వల్ల వారిలో చాలా మార్పు వచ్చింది. ఇది నాకు సంతృప్తినిచ్చింది.

నాకు ఇష్ట‌మైన‌వి ఇవే..
నాకు కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో స్నోయి ఉంటుంది. అది రెస్క్యూ డాగ్‌. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో నా భర్త పనిచేస్తున్న సమయంలో ఒకరోజు టూర్‌కు వెళ్లారు. ఆ కుక్క వెహికిల్‌ కింద పడబోయింది. ఆయన వెంటనే వాహనాన్ని ఆపి, నాకు ఇష్టమని దానిని నా కోసం తీసుకొచ్చారు. అది ఇప్పుడు నాతోనే ఉంటుంది.

#Tags