Civils Ranker Sai Kiran: రెండో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకర్‌గా.. కుటుంబంలో ఈ ఇద్దరే మొదటి పట్టభద్రులు.. కాని!

కనీస సౌకర్యాలకు నోచుకోని పల్లెలో పుట్టి.. పేదరికంతో సావాసం చేస్తూనే.. అక్షరాన్ని ఆయుధంగా మలచుకొని లక్షలమంది కలల కొలువైన సివిల్స్‌ సాధించాడు నందాల సాయికిరణ్‌. సాధించాలన్న కసి ఉంటే.. ఏదీ మన లక్ష్యానికి అడ్డు రాదని నిరూపించిన ఈ విజేత ప్రస్థానం అతడి మాటల్లోనే.

సాక్షి ఎడ్యుకేషన్‌: ‘మన లక్ష్మి కొడుకు కలెక్టరయ్యిండట...’ఇప్పుడు వెలిచాల ఊరిలో ఎవరి నోట విన్నా ఇదే మాట. కరీంనగర్‌కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందా పల్లె. అందరితో కలుపుగోలుగా ఉండే ఆ తల్లి లక్ష్మి మాత్రమే కాదు.. ‘మావాడు గొప్పవాడయ్యాడ’ని ఊరు ఊరంతా మురిసిపోతోంది.

దుఃఖాన్ని దిగమింగుకుంటూనే..

చిన్నప్పట్నుంచీ అమ్మానాన్న పని చేస్తేనే ఇల్లు గడిచే నేపథ్యం మాది. అలాంటిది ఏడేళ్ల కిందట నాన్న అనారోగ్యంతో మమ్మల్నందరినీ వదిలేసి వెళ్లిపోయారు. ఆర్థిక కష్టాలు మాకేం కొత్త కాదుగానీ.. ఆయన లేని వెలితి మానసికంగా వేధించేది. అప్పుడు దుఃఖాన్ని దిగమింగుకుంటూనే.. మాకు ధైర్యం చెబుతూ మాకోసం ఎంతో కష్టపడింది బీడీ కార్మికురాలైన మా అమ్మ. ఎందుకో తెలియదుగానీ ఆమెకి మొదట్నుంచీ అక్క, నాపై విపరీతమైన నమ్మకం. ఎప్పటికైనా మేం గొప్ప స్థాయికి ఎదుగుతామనేది.

నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే..

‘మీ చదువుతోనే మన బతుకు మారుతుంది. ఎంత పెద్ద స్థాయికైనా చేరొచ్చు. ఎదిగాక మనలాంటి వాళ్లకి సాయం చేయడం మర్చిపోవద్దు’ అని పదేపదే చెప్పేవారు మగ్గం నేసే మా నాన్న. మంచి ఉద్యోగం సాధిస్తేనే ఈ దుస్థితి మారుతుందని అప్పుడే అర్థమైంది. ఆ ప్రేరణతో పుస్తకాన్ని అందుకున్నాను. మనసు పెట్టి చదివాను. పదిలో టాపర్‌గా నిలవడంతో ఇంటర్లో ఫీజు రాయితీ ఇచ్చారు. అది నా నమ్మకానికి పునాదిలా మారింది.

Inspirational Story of UPSC Ranker: 7వ తరగతిలో ప్రమాదం, వైకల్యాన్ని లెక్కచేయకుండా యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తా చాటిన పార్వతి

ఈసారి మరింత కష్టపడితే 98 శాతం మార్కులొచ్చాయి. ఉపకార వేతనంతో వరంగల్‌ ఎన్‌ఐటీలో సీటు సాధించా. అయినా.. కొద్దిమొత్తం ఫీజులు, ఖర్చులు భరించే స్తోమత కన్నవాళ్లకి లేదు. విద్యారుణం తీసుకొని చదువుకున్నా. ఈ సమయంలోనే నాన్న కన్నుమూశారు. కుటుంబ భారమంతా అమ్మపైనే పడింది. మాకు అన్నిరకాలుగా అండగా ఉంటూ కష్టపడేదామె. కొన్నాళ్లకి అక్క స్రవంతికి ఏఈగా ఉద్యోగం వచ్చింది.

UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

ఐఏఎస్‌ ఆలోచన ఇలా..

బీటెక్‌ ఆఖరి ఏడాదిలో నేను ప్రాంగణ నియామకానికి ఎంపికయ్యా. మా ఇక్కట్లు తీరాయి. నేను ఉద్యోగంలో చేరేనాటికి నా వయసు ఇరవై ఒక్క ఏళ్లు. కాలం గడిచినకొద్దీ నాలో పరిణతి రాసాగింది. చిన్నప్పుడు ఎక్కడైనా గతుకుల రోడ్లను చూసినప్పుడు ‘నాకే గనక అధికారం ఉంటే మంచి రోడ్డు వేయించేవాడిని’ అనుకునేవాడిని. పాడుబడ్డ స్కూల్‌ని చూసినా, వైద్య సౌకర్యాలు లేని ఆసుపత్రులకు వెళ్లినా మనసు చలించేది. ఇలాంటి వాటిని బాగు చేసే శక్తి ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఇదేసమయంలో సమాజంలో ప్రభావవంతమైన మార్పులు తెచ్చిన కొందరు కలెక్టర్ల గురించి చదివా. అప్పట్నుంచి నా అంతిమ లక్ష్యం ఐఏఎస్‌గా మారింది.

ఉద్యోగం చేస్తూనే..

మూడేళ్ల కిందట నా సివిల్స్‌ వేట మొదలైంది. అప్పటికే నా ఎన్‌ఐటీ మిత్రులు కొందరు ప్రిపరేషన్‌ ప్రారంభించారు. వాళ్ల సలహాలు తీసుకున్నా. పాత ప్రశ్నపత్రాలు చూడటం.. గత విజేతల అనుభవాలు క్రోడీకరించడం.. వాళ్ల బ్లాగ్స్‌ ఫాలో అవడం.. రెండు నెలలు ఇదే చేశా. ప్రిపరేషన్‌ కోసం నా సీనియర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌ జాబ్‌ వదిలేసి రిస్కు తీసుకోలేదు. ఉద్యోగంలో ఉంటే నాకు సమయం తక్కువగా ఉంటుంది. ఆ కొద్ది సమయాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే కసి ఉంటుంది. పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లొచ్చు అనిపించింది.

JEE Mains 1st Ranker Nilkrishna Success Story : అదో మారుమూల గ్రామం.. ఓ సాధార‌ణ రైతు బిడ్డ.. నెం-1 ర్యాంక్ కొట్టాడిలా.. కానీ..

అన్నీ బంద్‌..

ఊహించినట్టే మొదటి ప్రయత్నం విఫలమైనా.. మళ్లీ వెంటనే మెయిన్స్‌కి తయారయ్యాను. ఈ సమయంలో నాకిష్టమైన సినిమాలు బంద్‌. స్నేహితులతో బాతాఖానీ కట్‌. ఆఫీసుకి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఏమాత్రం ఖాళీ దొరికినా పుస్తకం చేతిలో ఉండేది. వారాంతాల్లో అయితే పూర్తిగా వాటికే సమయం. ఆఫీసు పని, ప్రిపరేషన్‌తో ఒత్తిడికి గురైనప్పుడు ‘మంచి ఉద్యోగంలో ఉండి కూడా ఇంతలా కష్టపడటం అవసరమా?’ అని ఒక్కోసారి అనిపించేది. కానీ నా నేపథ్యం, సమాజంలో మంచి గౌరవం దక్కాలనుకోవడం, నా సంకల్పం ఇవన్నీ గుర్తొచ్చి మళ్లీ అడుగు ముందుకేసేవాడిని. ముఖాముఖి కోసం కొన్ని మాక్‌ ఇంటర్వ్యూల శిక్షణ పొందా. 

రెండోసారి తప్పని గురి..

నా ఆశయానికి అమ్మ ఆశీసులు తోడై, రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌ విజేతగా మీ ముందు నిలిచా. ర్యాంకు వచ్చిందని తెలియగానే ముందు సంతోషంగా అనిపించింది. రెండ్రోజులయ్యాక మామూలే. కానీ మా ఊరు మొత్తం ఇంకా పండగ వాతావరణంలోనే ఉంది. నాకన్నా ఎక్కువ, వాళ్లే సంతోషిస్తున్నారు. నాకు ఇంతకన్నా ఏం కావాలి..

Anugnya Scored 993/1000 Marks in TS Inter : టీఎస్ ఇంటర్‌లో 993/1000 మార్కులు.. సెకండియర్ టాప‌ర్ ఈమె.. ఎలా అంటే..?

నా గెలుపుకు ప్రయాణం ఇలా..

సివిల్స్‌ సాధించేందుకు ఎటువంటి శిక్షణ పొందకుండా నేనే సొంతంగా సిద్ధమయ్యాను. రకరకాల పుస్తకాలు, ఇతరుల సలహాలు, స్నేహితుల సహకారం, పలు ముఖాముఖి వీడియోలతోపాటు మా అమ్మ ఆశీసుల సహకారంతోనే ముందుకు సాగి ప్రస్తుతం, నేనే ఊహించని విధంగా ర్యాంకు సాధించాను. 100 నుంచి 200 మధ్య నా ర్యాంకు ఉంటుందనున్న నాకు 27వ ర్యాంకు రావడం చాలా ఆశ్యర్యంగా ఉన్నప్పటికీ ఎంతో సంతోషించాను. ఈ ప్రయాణంలో నేను ఏకాగ్రత, పట్టుదల, ఆత్మస్థైర్యం వంటి ఈ మూడు విజయసూత్రాలను గట్టిగా నమ్మాను.. మా కుటుంబంలో నేను, మా అక్క మాత్రమే  మొదటి పట్టభద్రులం.

ఆలోచన ఎంత గొప్పదైనా.. ఆచరణ సరిగా లేనప్పుడు ఫలితం దక్కదు. గొప్ప ఆలోచనను చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకుంటూ ముందుకెళ్లాలి.

--నందాల సాయికిరణ్‌

Civils Ranker Uday Krishna Reddy: ఎదుర్కొన్న అవమానాలే నన్ను విజయం వైపు నడిపించాయిలా..

#Tags