Tharun: పేదింటి బిడ్డకు పెద్ద కొలువు
కష్టాల కడలిని ఈదుతూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఓ వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రతిభ ఎవరి సొంతం కాదని నిరూపించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు తరుణ్. యూపీఎస్సీ వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకుతో మెరిశాడు.
వ్యవసాయ కూలీలు
పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు తరుణ్ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తరుణ్‌ను చదివించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. 2023లో సివిల్ సర్వీస్ మెయిన్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
నాయకుల ప్రశంసలు
సివిల్స్‌లో విజయం సాధించిన తరుణ్ తల్లిదండ్రుల సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. తమ బిడ్డకు అత్యున్నత ఉద్యోగం రావడంతో తమ కష్టాలు తీరిపోతాయని సంబురాలు చేసుకుంటున్నారు.
సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన యువకుడి ఎంపిక కావడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డితో పాటు మండల పరిధిలోని యువజన సంఘాల నాయకులు సన్మానించారు. మారు మూల గ్రామానికి చెందిన యువకుడు ఐఏఎస్‌కు ఎంపికకావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎనిమిదో తరగతి చదువుతుండగా ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని కోరిక పుట్టింది. అప్పటి నుంచి బీటెక్ పూర్తి అయిన తర్వాత బాబాయి, స్నేహితుల సహకారంతో ప్రిపరేషన్ మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి కడు పేదరికంలో మగ్గాను. ఉన్నతంగా చదివి కుటుంబానికి వెలుగులు తెద్దామని కష్టపడి చదివాను.
సివిల్స్‌లో విజయం సాధించడానికి రోజుకు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ చేశాను. స్నేహితులు, బంధువుల సహకారంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రిపేర్ అయ్యాను. ఎక్కువగా యూట్యూబ్‌లో పాఠాలు విని నేర్చుకున్నాను.
తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావొద్దని సొంతంగా పరీక్షలకు సిద్ధం అయ్యాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.