మేనేజ్‌మెంట్ కెరీర్‌కు...నైపుణ్యాల నావ!

ప్రవేశ పరీక్షలో సత్తా చాటి.. తరగతి గదిలో అడుగుపెట్టాక..రెండేళ్ల కోర్సులో అకడమిక్స్‌తో పాటు.. నైపుణ్యాలు పెంచుకోవాలి..అప్పుడే మేనేజ్‌మెంట్ నిపుణులుగా రాణించగలరు..జాబ్ మార్కెట్‌లో జెట్ వేగంతో దూసుకెళ్లగలరు...
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) చదివితే మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు లభిస్తాయనేది నిస్సందేహం. ఇందుకు ప్రస్తుత రోజుల్లో తరగతి గది పాఠాలు, పుస్తకాలు సరిపోవు. ప్రాపంచిక దృక్పథం.. వాస్తవ పరిస్థితులపై అవగాహన.. కంపెనీల కొత్త పోకడలు.. ఇలా ఎన్నో అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తద్వారా ఎంబీఏ పట్టాతో పాటు.. భవిష్యత్తు మేనేజ్‌మెంట్ నాయకులుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ స్కిల్స్ ఏమిటో.. వాటిని అందుకునే మార్గాలేమిటో చూడండి.

వాస్తవిక దృక్పథం (రియలిస్టిక్ అప్రోచ్)...
అత్యంత ప్రాధాన్య, ప్రాథమిక ఆవశ్యకత ఇది. ప్రతి విషయాన్ని పరిస్థితులకు అన్వయించే దృక్పథంతో వ్యవహరించగల నేర్పు ముఖ్యం. నేటి కాలంలో కంపెనీల్లో నిర్వహణ, విధానాల పరంగా నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిని తెలుసుకుంటూ.. అవి తరగతిలో చదువుకున్న పాఠాలకు ఏ విధమైన సంబంధం కలిగున్నాయో విశ్లేషించుకోవాలి.

ఆచరణాత్మకత (ప్రాక్టికాలిటీ)...
ఎంబీఏ విద్యార్థులు ప్రతి విషయాన్ని ఆచరణాత్మక దృక్పథంతో చూడగలగడం సొంతం చేసుకోవాలి. తద్వారా రియలిస్టిక్ అప్రోచ్ కూడా సొంతమవుతుంది. ఈ రెండూ కలిస్తే.. మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్‌గా మంచి కెరీర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

సెమినార్స్.. లెక్చర్స్...
రియల్ టైం ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్ అవేర్‌నెస్ పెంచేందుకు అందుబాటులో ఉన్న మార్గాల్లో ముఖ్యమైనవివి. ఈ క్రమంలో ఫిక్కీ, అసోచామ్, ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ వంటి సంస్థలు నిరంతరం సెమినార్స్ నిర్వహిస్తున్నాయి. పరిశ్రమ, విద్యా నిపుణులు కలిసి.. రంగాలవారీ తాజా పరిస్థితులపై, అందుకు తగినట్లుగా విద్యార్థులు సొంతం చేసుకోవాల్సిన నైపుణ్యాలపై లెక్చర్స్ ఇచ్చే చర్యలు చేపడుతున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు చేయాల్సిందల్లా.. ఆయా సంస్థల్లో స్టూడెంట్ మెంబర్స్‌గా పేర్లు నమోదు చేసుకోవడమే. దీనివల్ల ఎప్పటికప్పుడు.. తదుపరి నిర్వహించే సెమినార్లు, లెక్చర్స్, ఇతర ఈవెంట్స్ సమాచారం అందుతుంది.

పరిశ్రమల సందర్శన...
పరిశ్రల సందర్శన లేదా పరిశ్రమల పర్యటనను ఇప్పటివరకు ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్యార్థుల కోణంలోనే వింటున్నాం. మేనేజ్‌మెంట్ రంగంలోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది. విద్యార్థులు పరిశ్రమకు వెళ్లడం.. తమ స్పెషలైజేషన్ సంబంధిత విభాగాల్లో విధులు, కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరును అక్కడి సీనియర్ల ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. స్పెషలైజేషన్ సంబంధిత విభాగమే కాక మొత్తం కంపెనీ పనితీరు.. యాజమాన్య విధానాలపై అవగాహన వస్తుంది.

ప్రాజెక్ట్ వర్క్స్ :
ఇవి నైపుణ్యాలు పెంచుకోవడానికి అత్యంత అనుకూల సాధనం. స్పెషలైజేషన్‌కు సంబంధించి నిర్దిష్ట అంశంపై క్షేత్ర స్థాయిలో ఒక సంస్థలో నిర్ణీత వ్యవధిలో పనిచేసే అవకాశం ఇది. ఈ క్రమంలో అభ్యర్థులు సదరు సంస్థలో సంబంధిత విభాగంలో కార్యకలాపాల నిర్వహణ, అనుసరిస్తున్న విధానాలు, సమస్యలు- సవాళ్లు, చూపుతున్న పరిష్కారాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు కూడా తమ దృష్టికి వచ్చినవాటికి మార్గాలు కనుగొనే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వారికి ప్రధానంగా లభించేవి సమస్య- పరిష్కారం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. ఈ పోటీ యుగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నవి కూడా ఇవే.

ఇంటర్న్‌షిప్స్...
సాధారణంగా నెలన్నర, రెండు నెలల వ్యవధిలో ఒక సంస్థలో ఇంటర్న్ ట్రైనీగా అక్కడి పరిస్థితులపై, వాస్తవ పనితీరుపై అవగాహన పొందవచ్చు. ప్రముఖ మేనేజ్‌మెంట్ కళాశాలల, నగరాల్లోని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు పొందడం కొంత తేలికగా మారింది.

టీమ్ స్కిల్స్: గ్రూప్ టాస్క్స్...
ఇటీవల ప్రముఖ బిబినెస్ స్కూల్స్.. విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంచేందుకు చేపడుతున్న వినూత్న విధానం గ్రూప్ టాస్క్స్. నిర్ణీత సంఖ్యలో విద్యార్థులను బృందాలుగా విభజించి.. ఒక్కో బృందానికి ఒక వాస్తవిక సమస్యను కేటాయించి.. పరిష్కార మార్గాలు కనుగొనాలని నిర్దేశిస్తున్నాయి. ఈ క్రమంలో బృందానికి ఒక ప్రొఫెసర్‌ను ప్రేరకుడిగా నియమిస్తున్నాయి. ఫలితంగా సమస్యను విశ్లేషించి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లభిస్తుంది. బృందాన్ని నడిపించే లక్షణాలతో పాటు అందరితో కలిసి పనిచేసే సంస్కృతి సైతం అలవడుతుంది.

క్యాంపస్ ఫెస్ట్స్ :
ప్రొఫెషనల్.. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులకు భవిష్యత్తులో విధుల నిర్వహణ పరంగా అత్యంత ఆవశ్యకమైన సహజ నైపుణ్యం ‘నలుగురిలో కలిసి పనిచేయడం’, ‘భిన్న నేపథ్యాలున్న క్లయింట్లతో సంప్రదించడం’. దీన్ని గుర్తించిన బి-స్కూల్స్.. ఇటీవల ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా ప్రొడక్టివ్ వేలో నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో క్యాంపస్ ఫెస్టివల్స్, అందుకు సంబంధించి నిర్దేశించిన అంశాల్లో ఒక్కోదానికి ఒక్కో విద్యార్థి బృందాన్ని నియమిస్తున్నాయి. తద్వారా విద్యార్థులకు వారికి కేటాయించిన అంశాన్ని/ఈవెంట్‌ను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించే నైపుణ్యం లభిస్తుంది. ఈ ప్రణాళిక రచన నైపుణ్యం భవిష్యత్తులో విధుల నిర్వహణలో సైతం ఎంతో ఉపయుక్తం. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల సమయంలోనూ కంపెనీలు అభ్యర్థుల రెజ్యుమెలో విద్యా ప్రగతితో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుకైన ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఎక్స్‌పోస్ టు.. రియల్‌టైం ఎక్స్‌పోజర్...
విద్యార్థులకు రియల్ టైం ఎక్స్‌పోజర్ అందించేందుకు కొత్తగా రూపుదిద్దుకుంటున్న సంస్కృతి మేనేజ్‌మెంట్ ఎక్స్‌పోస్ (ఎగ్జిబిషన్స్)/ బిజినెస్ ఎక్స్‌పోస్ (ఎగ్జిబిషన్స్). వీటిని కళాశాలలు తమ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నాయి. వీటికి ఇండస్ట్రీ వర్గాల నిపుణులను ఆహ్వానిస్తున్నాయి. విద్యార్థులు కాన్సెప్ట్‌లకు సంబంధించి తాము రూపొందించిన విశ్లేషణలను వ్యక్తం చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. వీటివల్ల లభించే ముఖ్య నైపుణ్యం భావ వ్యక్తీకరణ. విధి నిర్వహణ పరంగా ఎంతో అవసరమైన నెగోషియేషన్ స్కిల్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.

ఇంకా ఎన్నెన్నో మార్గాలు...
ప్రాక్టికాలిటీ, రియలిస్టిక్ అప్రోచ్, రియల్ టైం ఎక్స్‌పోజర్‌కు సంబంధించి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. తరగతి గదిలోనే గడిపి సర్టిఫికెట్‌తో కంపెనీలో అడుగుపెట్టిన తర్వాత తమ విధానాలకు అనుగుణంగా సరితూగడం లేదని, విధి నిర్వహణలో సవాళ్లు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఉండట్లేదని భావించిన ఇండస్ట్రీ వర్గాలు.. విద్యార్థులకు అనువైన వాతావరణం, నైపుణ్యాల పెంపునకు దోహదం చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి విద్యార్థుల్లో రియల్ స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

అకడమిక్స్ ద్వారా పొందగలిగేవి..
  • రియల్ టైం ఎక్స్‌పోజర్ (మార్గం: ప్రాజెక్ట్ వర్క్)
  • ఇండస్ట్రియల్ విజిట్స్/టూర్స్
  • ఇంటర్న్‌షిప్స్

స్వయంగా నేర్చుకోవాల్సినవి..
  • కల్చరల్ స్కిల్స్
  • ఇంటర్ పర్సనల్ స్కిల్స్
  • నెగోషియేషన్ స్కిల్స్
  • పాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
























#Tags