Lionel Messi Achievements and Awards: హార్మోన్‌ లోపంతో ఇబ్బంది... ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌... మెస్సీ జీవిత విశేషాలు తెలుసా....

లియోనల్‌ మెస్సీ... ఈ పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనాను విజయతీరాలకు చేర్చడంతో మెస్సీ పేరు ట్రెండింగ్‌ అవుతోంది.

ఫుట్‌బాల్‌ మీద ఏ మాత్రం ఆసక్తిలేని భారతీయులు కూడా ఇప్పుడు మెస్సీ పేరును జపిస్తున్నారు. అతడి జీవితంలో ఎన్నో అద్భుతాలు, కొన్ని విషాదాలు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం...  
సాకర్‌లో రారాజు... మెస్సీ
ఫుట్‌బాల్‌ ఆటగాళ్లంటే మొదట గుర్తొచ్చే పేర్లు.. మెస్సీ, రొనాల్డో. తమ ఆటతో.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. రొనాల్డో కంటే ఓ మెట్టుపైనే ఉంటాడు అర్జెంటీనా దిగ్గజం, బార్సిలోనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ. రొనాల్డోకు సాధ్యం కాని ఎన్నో ఘనతల్ని సాధించి.. సాకర్లో రారాజుగా పేరు గడించాడు.  
1987 జూన్‌ 24న జననం...
లియోనల్‌ మెస్సీ.. 1987 జూన్‌ 24న అర్జెంటీనాలోని రోసారీలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడుతున్నప్పటికీ.. స్పానిష్‌ ఫుట్బాల్‌ క్లబ్‌ బార్సిలోనాతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఆ క్లబ్‌తో అతడికి విడదీయరాని అనుబంధం ఉంది. 11 ఏళ్ల వయసులో హార్మోన్‌ లోపం అతడిని ఇబ్బంది పెట్టింది. చికిత్స కోసం నెలకు 900 డాలర్లు కట్టాలి. ఆ సమయంలో.. ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనా కాంట్రాక్టుపై సంతకం చేస్తేనే వైద్యానికి డబ్బులు వస్తాయి. ఏం ఆలోచించకుండా.. కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అతని వైద్యానికి అయిన ఖర్చులను క్లబ్‌ చెల్లించింది.
– 2003లో తొలిసారి బార్సిలోనా క్లబ్‌ (స్పెయిన్‌)తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడతని వయసు 17 ఏళ్లే. 
– 2017లో ఆంటోనెల్లా రోకుంజోను వివాహం చేసుకున్న మెస్సీకి.. ముగ్గురు కుమారులు.
– ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాలుగు అవార్డులు( బాలన్‌ డీ ఓర్, ఫిఫా వరల్డ్‌ ప్లేయర్, పిచిచీ ట్రోఫీ, గోల్డెన్‌ బూట్‌) అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీ. 2009–10 సీజన్లో ఈ ఘనతను అతడు సాధించాడు. 
– అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడికి ఇచ్చే బాలన్‌ డీ ఓర్ను అవార్డును ఏకంగా ఆరుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీ. 2009,10,11,12,15,19లలో దీనిని సొంతం చేసుకున్నాడు. 
– పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు సాధించి.. మెస్సీ వెనుక ఉన్నాడు. 
– యూరో లీగ్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్‌ షూను కూడా ఆరుసార్లు పొందిన ఏకైక ఆటగాడు మెస్సీనే. 
– ఒక క్యాలెండర్‌ ఇయర్లో ఎక్కువ గోల్స్‌ చేసిన ఆటగాడు మెస్సీనే. 
– 2012లో అన్ని టోర్నీల్లో కలిపి మొత్తం 91 గోల్స్‌ చేశాడు. ఒక క్లబ్‌ తరఫున ఎక్కువ గోల్స్‌ చేసింది మెస్సీనే. 
– బార్సిలోనాకు ఆడుతూ.. ఇప్పటివరకు 672 గోల్స్‌ చేసి, బ్రెజిల్‌ లెజెండ్‌ పీలే(643)ను అధిగమించాడు. 
– చిన్న వయసులోనే  తొలి గోల్, అలాగే వందోది, రెండొందల గోల్‌ చేసింది మెస్సీనే. 
– మైదానంలో మెస్సీ వేగం, చురుకుదనం కారణంగా.. అతడిని ’ది ఫ్లీ’ అని కూడా పిలుస్తుంటారు. 
– ప్రపంచ ఫుట్బాల్‌ ఆటగాళ్లలో అత్యంత ధనవంతుడు మెస్సీనే. అతని ఆస్తి 126 మిలియన్‌ డాలర్లు.
– తొలిసారి మెస్సీ నైపుణ్యాలు, ఆటను మెచ్చిన బార్సిలోనా డైరెక్టర్‌ కార్లెస్‌ రియాచ్‌.. వెంటనే కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అప్పట్లో పేపర్‌ అందుబాటులో లేకుంటే టిష్యూ పేపర్‌పై కాంట్రాక్ట్‌ సంతకం చేశాడు. 
– బార్సిలోనా తరఫున అత్యంత చిన్న వయసులో(17) గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 
– ఇతనికి రెండు పాస్‌పోర్టులున్నాయి.. అర్జెంటీనా సహా స్పెయిన్‌లో అతడికి పౌరసత్వం ఉంది.
– బ్రెజిల్‌ దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు.. రొనాల్డినో నుంచి 2008లో జెర్సీ నెం.10ను పొందాడు. 
– 2009లో తొలిసారి ఫిఫా వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. 
– అర్జెంటీనా జాతీయ జట్టుకు ఆడే మెస్సీని.. స్పెయిన్‌ తరఫున ఆడాలని ఆ దేశం కోరినా సున్నితంగా తిరస్కరించాడు. 
– పిల్లలకు మంచి విద్య, వైద్య సదుపాయాల కోసం.. లియో మెస్సీ అనే ఫౌండేషన్ను స్థాపించాడు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గానూ ఉన్నాడు.
– ఇన్నేళ్లుగా అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ని మాత్రం ముద్దాడలేకపోయాననే వెలతి మెస్సీలో ఉండేది.. కానీ, 2022 ఫిఫా కప్‌ గెలవడంతో అతడి కెరీర్‌ పరిపూర్ణమైందనడంలో అతిశయోక్తి లేదు.

#Tags