Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

పదోతరగతి తర్వాత అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యకు మార్గం.. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ). పల్లె ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు సైతం నాణ్యమైన చదువులు చదవాలనే సమున్నత ఆశయంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2008లో ఈ ట్రిపుల్‌ఐటీలకు అంకురార్పణ చేశారు. అలా ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని బాసర, ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలుల్లోని క్యాంపస్‌ల్లో వేల మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ 2023-24 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఆయా క్యాంపస్‌ల్లో సీట్లు, దరఖాస్తుకు అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, విద్యావిధానం తీరుతెన్నులు తెలుసుకుందాం...

ఆర్‌జీయూకేటీ, బాసర

తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ), బాసరలో 2023-24లో ప్రవేశాల దరఖాస్తులకు గడువు జూన్‌ 19వ తేదీన ముగియనుంది. ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా జూన్‌ 26న ప్రకటించనున్నారు.

అర్హతలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 2023లో పదో తరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. అభ్యర్థుల వయసు 01.06.2023 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులైతే 21 ఏళ్ల లోపు ఉండాలి.

చ‌ద‌వండి: ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్‌ ఐటీఐ

సీట్లు

ట్రిపుల్‌ ఐటీ బాసరలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 1650 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక కోటాలో తెలంగాణ ప్రాంత విద్యార్థులతో, మిగతా 15 శాతం సీట్లను ఓపెన్‌ కోటాలో మెరిట్‌ ప్రాతిపదికన తెలంగాణ, ఏపీ విద్యార్థులతో భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందని విద్యార్థులకు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్‌ఆర్‌ఐల పిల్లలు, విదేశీ విద్యార్థులకు సూపర్‌ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశాలిలా

పదో తరగతిలో పొందిన జీపీఏ(గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) ఆధారంగా, ప్రతి సబ్జెక్టులోనూ విద్యార్థి పొందిన గ్రేడు ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ను అనుసరించి ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాలలైన జిల్లా పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు సాధించిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలుపుతారు. అంటే.. ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 9.6 జీపీఏ వస్తే.. 0.4 జీపీఏ పాయింట్లు డిప్రివేషన్‌ స్కోరుగా అదనంగా కలపడంతో 10 జీపీఏ అవుతుంది. ఆర్‌జీయూకేటీలో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ ఉంటుంది. మొత్తం సీట్లలో అన్ని కేటగిరీలలో బాలికలకు 33శాతం(1/3 శాతం) రిజర్వేషన్‌ విధానం అమలవుతుంది.

మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

చాలామంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించి ఉంటారు. విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు కీలకం కానున్నాయి. మొదట గణితంలో ఎక్కువ జీపీఏ సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అందులోనూ టై ఏర్పడితే.. ప్రాధాన్యత క్రమంలో వివిధ సబ్జెక్టుల్లో పొందిన జీపీఏ పాయింట్లను పరిశీలిస్తారు. అవి.. మ్యాథ్స్‌ తర్వాత జనరల్‌ సైన్స్, ఇంగ్లిష్, సోషల్‌ స్టడీస్, మొదటి లాంగ్వేజ్‌లో వచ్చిన జీపీఏ పాయింట్లను పరిశీలిస్తారు. అన్నింటిలోనూ సమానమైన మార్కులు వస్తే పుట్టిన తేదీని బట్టి వయసు ఎక్కువ ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఇక్కడ కూడా ఒకే పుట్టిన తేదీ ఉంటే.. తక్కువ హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ను పరిగణిస్తారు.

చ‌ద‌వండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

ఎంపిక చేసిన విద్యార్థుల ప్రొవిజినల్‌ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఎంపికైన విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు/డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ కోసం ఆర్‌జీయూకేటీ బాసరలో వ్యక్తిగతంగా హాజరవ్వాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.

ఫీజుల వివరాలు

ట్రిపుల్‌ ఐటీల్లో నామమాత్రపు ఫీజులతో కోర్సు­లు పూర్తి చేయవచ్చు. తెలంగాణ, ఏపీ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు రూ.37 వేలు ట్యూషన్‌ ఫీజుగా చెల్లించాలి. దీనికి అదనంగా అడ్మిషన్‌ సమయంలో రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజు(ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రూ.500), రూ.2000 రిఫండబుల్‌ డిపాజిట్, రూ.700 మెడికల్‌ ఇన్సూరెన్స్‌ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల ఏడాదికి రూ.1,37,000 ఫీజు చెల్లించాలి.

విద్యావిధానం

ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ను రెండు దశలుగా విభజిస్తారు. మొదటి దశలో విద్యార్థులు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ)లో భాగంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు/సంస్కృతం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో ఎంపీసీ కోర్సు చదవాల్సి ఉంటుంది. పీయూసీ నుంచే సెమిస్టర్‌ విధానం అమలవుతుంది. తర్వాత రెండో దశలో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. ఇందులో కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

చ‌ద‌వండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

దరఖాస్తు విధానం

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌ ప్రింట్‌ తీసుకోవాలి. పీహెచ్‌/సీఏపీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్‌లను జతచేసి దరఖాస్తుల ప్రింట్‌లను యూనివర్సిటీకి పోస్టు చేయాలి. జనరల్, బీసీ విద్యార్థులు అప్లికేషన్‌ ఫీజు రూ.500; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.450లు చెల్లించాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 19, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌అవుట్‌ స్వీకరణకు చివరి తేది: జూన్‌ 24, 2023
  • ప్రొవిషనల్‌ ఎంపిక జాబితా ప్రకటన: జూన్‌ 26, 2023
  • వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/

#Tags