Intermediate Practical Examinations: నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..

హాజరుకానున్న 14,543 మంది విద్యార్థులు
ఈ ప్రయోగ పరీక్షలకు మొత్తం 14,543 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తొలి విడతలో ఒకేషనల్ విద్యార్థులకు 29 కేంద్రాల్లో, మలి విడతలో జనరల్ విద్యార్థులకు 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకేషనల్ విద్యార్థులు 4,189 మంది ఈ పరీక్షలకు హాజరు కానుండగా వారిలో 1,801 మంది బాలురు, 2,388 మంది బాలికలు ఉన్నారు. అలాగే జనరల్ విద్యార్థులు 10,354 మంది ఈ పరీక్షలకు హాజరుకానుండగా వారిలో 4,452 మంది బాలురు, 5,902 మంది బాలికలు ఉన్నారు.
జంబ్లింగ్ పరీక్ష రద్దుతో..
గత ప్రభుత్వం సైన్స్ గ్రూపులు ఉన్న కాలేజీల్లో తప్పనిసరిగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాల్సిందిగా నిబంధనలు పెట్టి ప్రైవేట్, కార్పొరేట్ హవాను తగ్గించింది. అంతేకాకుండా ప్రాక్టికల్స్ పబ్లిక్ పరీక్షలకు వచ్చేసరికి జంబ్లింగ్ విధానం అమలు చేసి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల ఆధిపత్యానికి చెక్ పెట్టింది. కానీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌కు వంత పాడుతూ వాళ్లు చెప్పినట్లే నడుచుకుంటోంది.
ఇంటర్మీడియెట్‌లో సైన్సు గ్రూపులు నిర్వహించే అన్ని కళాశాలలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే చాలా కళాశాలలను పరిశీలించాం. అన్నింటిలో ప్రయోగశాలలు ఉన్నాయి. ప్రయోగశాలలు లేని కళాశాలలను గుర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత ఇన్విజిలేటర్లను ఇప్పటికే ఆదేశించాం.
– కే చంద్రశేఖర బాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి