Intermediate Exams 2024:ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Intermediate Exams 2024:ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

మార్కాపురం: వచ్చే నెల 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ఆర్‌ఐఓ సైమన్‌ విక్టర్‌ తెలిపారు. సోమవారం ఆయన మార్కాపురంలో మాట్లాడుతూ మొత్తం 44,733 మంది విద్యార్థుల కోసం 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో ప్రథమ పరీక్ష విద్యార్థులు 21,570 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 23,163 మంది ఉన్నారన్నారు. ఈ నెల 20 వరకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయన్నారు. ఈనెల 23న విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, కస్టోడియన్‌లు ఉంటారన్నారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు:

జిల్లాలో 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 3 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వీటికి అదనంగా మరో రెండు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు పెడుతున్నట్లు తెలిపారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష జరిగే సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని ఆర్‌టీసీ అధికారులను కోరినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వాష్‌రూమ్స్‌, వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పరీక్ష హాల్లోకి మొబైల్‌ ఫోన్స్‌ను ఎవరు వినియోగించకూడదన్నారు. పరీక్షల నిర్వహణలో సిబ్బంది, విద్యార్థులు అక్రమ పద్ధతులకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: AP Inter 1st Year Study Material

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి:

జిల్లాలో దోర్నాల, యర్రగొండపాలెం, కంభం, అర్ధవీడు, గిద్దలూరు సెంటర్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని, ఈ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో మానసిక స్దైర్యం నింపేందుకు ఈనెల 22న కలెక్టర్‌ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులతో మాట్లాడిస్తామన్నారు. 1 నిమిషం నిబంధన అమలులో ఉందని, 8.30 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావాలన్నారు.

#Tags