Exams 2024: ఇంటర్మీడియెట్, పదో తరగతి, ఓపెన్ స్కూలు పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి, ఓపెన్ స్కూలు పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసి యంత్రాంగాన్ని సిద్ధం చేశామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రకాశం భవనంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు 44,733 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. అందులో మొదటి సంవత్సం 21,570 మంది, రెండో సంవత్సరం 23,163 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో 5 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక నిఘాతో పాటు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఇంటర్ పరీక్షలకు 69 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 69 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 23 మంది కస్టోడియన్‌లు, 43 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించినట్లు వివరించారు. అదేవిధంగా 3 సిట్టింగ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 29,449 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలకు 14,800 మంది బాలురు, 14,649 మంది బాలికలు హాజరవుతున్నట్లు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు 798 మంది బాలురు, 681 మంది బాలికలు హాజరవుతున్నారని వివరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 6 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా గుర్తించామన్నారు. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
● ఓపెన్ స్కూలు పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1660 మంది, ఇంటర్మీడియెట్ పరీక్షలకు 5258 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు.
● ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు 25 పరీక్ష కేంద్రాలు, పదో తరగతి పరీక్షలకు 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.
● ఈ నెల 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించామని, పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌ఐఓ సైమన్ విక్టర్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాసరావు, డీఈఓ సుభద్ర పాల్గొన్నారు.
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు పది పరీక్షలు జిల్లాలో సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకున్నాం వివరాలు వెల్లడించిన కలెక్టర్ దినేష్‌కుమార్