School Education Department: గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం
విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా కార్యక్రమాలకే పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ (పాఠశాల విద్య) జీవో 185 జారీ చేశారు. రాష్ట్ర ఉచిత, నిర్బంధ విద్యాహక్కు 2010 చట్టాన్ని సవరిస్తూ ఈ ఉత్తర్వులు వెలువరించారు. తాజా ఉత్తర్వులతో బోధనాభ్యసన ప్రక్రియ, విద్యా సంబంధిత కార్యక్రమాలు సమగ్రంగా కొనసాగి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాల బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా అసిస్టెంట్లకు ఇప్పటికే అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మెరుగైన నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటోంది. తద్వారా టీచర్లు ఇకపై పూర్తిగా బోధనపైనే దృష్టి కేంద్రీకరించేలా చేసి వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించింది.
చదవండి: UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్
విద్యా సంస్కరణలతో..
విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో మూడేళ్లుగా పరిస్థితులు సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. విద్యాదీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి, ఫౌండేషన్ స్కూళ్లు, ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులకు సర్కారు భరోసా కల్పిస్తోంది. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.24 వేల వ్యయంతో స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్ల వ్యయంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12 వేల విలువ చేసే ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది. 4 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్‌ను ప్రత్యేక యాప్ ద్వారా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు తరగతి గదుల్లో టీవీలు, డిస్‌ప్లే బోర్డుల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా గ్రహించేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లీష్ ల్యాబ్‌లను నెలకొల్పి 11 వేల స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లను దశలవారీగా సీబీఎస్‌ఈతో అనుసంధానిస్తోంది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపట్టడంతోపాటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బై లింగ్యువల్) అందచేస్తోంది. మనబడి నాడు – నేడు ద్వారా 56,572 ప్రభుత్వ విద్యా సంస్థల్లో రూ.16,450 కోట్ల వ్యయంతో దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తీర్చిదిద్దుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఈ పనుల్లో నాణ్యత పరిశీలన బాధ్యతలను అప్పగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ బడులు, కళాశాలల్లో టాయ్‌లెట్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు తొలిసారి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత మన రాష్ట్రానిదే. రాష్ట్రవ్యాప్తంగా 44,472 ప్రభుత్వ స్కూళ్లలో 45,313 మంది ఆయాలను నియమించి గౌరవ వేతనం చెల్లిస్తోంది. నాడు – నేడు స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక స్తోమత కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. జగనన్న విద్యాకానుక కింద బైలింగ్యువల్ టెక్సŠట్ బుక్కులు, వర్కు బుక్కులు, బ్యాగు, 3 జతల యూనిఫారం, షూ, సాక్సులతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని కూడా ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి విద్యతో పాటు మంచి పౌష్టికాహారం కూడా ఎంతో అవసరం. దీన్ని గుర్తించి జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పోషక విలువలున్న ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కారాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది.
చదవండి: Jobs: యూనివర్సిటీల్లో పేరుకుపోయిన ఖాళీలు.. మెుత్తం పోస్టుల వివరాలు ఇలా..
ఏ అవసరం వచ్చినా..
టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుండటం వల్ల బోధనాభ్యసన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఏ అవసరం వచ్చినా టీచర్లకే బాధ్యతలు కేటాయించడం వల్ల పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుండా పోతున్నారు. కొంతమంది టీచర్లు ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్ల పీఏలుగా కూడా టీచర్లు పనిచేసిన పరిస్థితి గతంలో నెలకొంది. ఇలా మొత్తం టీచర్లలో 5 శాతం మంది పాఠశాలలకు దూరం కావడం బోధనపై ప్రభావం చూపుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని, ఇతర విధుల్లో ఉంటున్న వారిని వెంటనే వెనక్కు రప్పించాలని గడువు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని వెనక్కు రప్పించి పాఠశాలల్లో బోధనకు వీలుగా పునర్నియామకం చేసింది.
చదవండి: Pre Matric Scholarship: 9, 10 తరగతులకే: కేంద్రం
ఇన్నాళ్లకు..
తమకు విద్యేతర కార్యక్రమాలు అప్పగించవద్దని టీచర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో లక్ష్యాల మేరకు బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించలేకపోతున్నామని నివేదించినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
చదవండి: Part Time Jobs: చదువుతోపాటు సంపాదన!
ప్రయోజనం ఇలా..
ప్రతి విద్యార్థిపైనా దృష్టి
టీచర్లు పాఠశాలల్లో పూర్తిగా విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల విద్యార్ధులకు పూర్తిస్థాయిలో బోధన అందుతుంది. టీచర్లు తమ బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించడానికి వీలుంటుంది. తరగతిలో ఒక్కో విద్యార్థి అభ్యసనం ఎలా ఉంది? లోపాలు ఏమిటి? అనే అంశాలపై దృష్టి సారించి లోపాలను సరిదిద్దడంపై టీచర్లు దృష్టి సారించగలుగుతారు.
ఉన్నత ప్రమాణాలు...
పాఠశాలల్లో బోధనాభ్యసన కార్యక్రమాలు మెరుగుపడటం ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు దారి తీస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఫౌండేషనల్ స్కూళ్ల విధానం తెచ్చిన విషయం తెలిసిందే.
స్కూళ్ల మ్యాపింగ్
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడానికి వీలుగా ఫౌండేషన్ విద్యతో సహా ఆరంచెల స్కూళ్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 3, 4 5 తరగతులను కిలోమీటర్ పరిధిలోని ప్రీ–హైస్కూళ్లు, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో బోధించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 4,943 ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను 3,557 ప్రీ–హైస్కూల్, ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశారు. జీవో నెంబర్ 117 ప్రకారం ఇలా మ్యాపింగ్ అయిన హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో 7,928 మంది సబ్జెక్ట్ టీచర్లు అదనంగా అవసరమని గుర్తించారు. ఈ మేరకు సబ్జెక్టు టీచర్ల నియామకానికి వీలుగా 3,095 ఇతర సబ్జెక్టు పోస్టులను అవసరమైన సబ్జెక్టు పోస్టులుగా మార్పు చేశారు. ఇవే కాకుండా 3,993 పోస్టులను సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంటు పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటిలో 287 స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టులుగా, 3,706 ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇలా సబ్జెక్టు టీచర్ పోస్టులుగా కన్వర్ట్ అయిన, అప్‌గ్రేడ్ చేసిన పోస్టులలో టీచర్లను నియమిస్తున్నారు.
మ్యాపింగ్‌తో మిగులు టీచర్ల సర్దుబాటు
3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానంతో మిగులు టీచర్లను మ్యాపింగ్ అయిన స్కూళ్లలో నియమించడం ద్వారా విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. స్కూళ్ల పునర్విభజన కసరత్తు తర్వాత ఫౌండేషన్ ప్లస్, ప్రీ–హైస్కూల్, హైస్కూల్‌లో మిగులు ఉన్నట్లు గుర్తిస్తే తాత్కాలికంగా అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తోంది. పదోన్నతులు, ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఆర్టీఈ నిబంధనల ప్రకారం స్కూల్ కాంప్లెక్స్‌లో లేదా అదే మండలంలో సర్దుబాటు చేస్తున్నారు. దీని ప్రకారం ఇప్పటికే 3,726 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్‌లను తాత్కాలికంగా అవసరమైన ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారు. దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ పలుచోట్ల సరిగా అమలు చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు విద్యాశాఖ గుర్తించి దృష్టి సారించింది.
బోధనకు వెళ్లకుంటే చర్యలు తప్పవు
బోధనకు ఎక్కడా ఆటంకం లేకుండా ఉండాలని ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కొన్ని చోట్ల బోధనకు టీచర్లు విముఖత చూపుతున్నారని, కొన్ని చోట్ల సమన్వయం లోపం వంటి సమస్యలతో బోధన అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. మంగళవారం దీనిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్జేడీలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. పలు హైస్కూళ్లలో అవసరమైన సంఖ్యలో టీచర్లను నియమించినా బోధన చేయడం లేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ హైస్కూలులో 3నుంచి 10వ తరగతి వరకు 19 మంది టీచర్లను నియమించినా కింది తరగతులకు బోధన చేపట్టడం లేదని ఆర్జేడీ వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణ, ఉపపట్టణ ప్రాంతాల్లో మిగులుగా ఉన్న టీచర్లను మారుమూల ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. హైస్కూలు, మ్యాపింగ్ హైస్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లలో ఎక్కడా టీచర్ల కొరత అనేదే ఉండరాదని, ఆ దిశగా డీఈఓలు సర్దుబాటు చేయాలని సూచించారు.
కర్నూలుకు 1,876 పోస్టుల మంజూరు
కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా తీవ్ర సమస్యగా మారిన టీచర్ల కొరతను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం అదనపు టీచర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాకు ఏకంగా వివిధ కేటగిరీలలో 1,876 పోస్టులను కేటాయించింది. ఇతర జిల్లాల్లో మిగులు పోస్టులను ఈ జిల్లాకు మళ్లించడం ద్వారా సమస్యను పరిష్కరించింది.
రాష్ట్ర విద్యాహక్కు చట్టం 2010లో అదనపు అంశాలు
ఉపాధ్యాయులకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించకుండా ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని అంశాలను జోడించింది. ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 మార్చి 3న విడుదలైన జీవో 20లో వీటిని చేర్చింది. ఆ జీవోలో ప్రస్తుతం 29 రూల్స్ ఉండగా 30వ రూల్‌గా ‘డిప్లాయ్‌మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్’ (టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో నియమించడం) కింద దీన్ని పొందుపరిచింది.
- తరగతి గదిలో పిల్లల విద్యా సంబంధిత సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఉపాధ్యాయులు బోధన కార్యకలాపాల్లో తమ సమయాన్ని పూర్తిగా కేంద్రీకరించాలి. ఉత్తమ బోధనకు అంకితం కావాలి.
- ఉపాధ్యాయులు సాధ్యమైనంత వరకు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలు మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇతర విధుల్లో వారిని నియమించరాదు.
- ఏదైనా అనివార్య పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరినీ మోహరించిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో నియమించాలి.
- సెక్షన్ 27 నిబంధనలకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం మరింత బలోపేతం