Tenth Class Public Exams 2024: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం

Tenth Class Public Exams 2024: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం

అనంతపురం : పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 8 వరకు మూల్యాంకనం జరుగుతుంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు స్థానిక కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలోని ‘క్యాంపు’లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.80 లక్షల జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయి. వాటిని స్ట్రాంగు రూంలో భద్రపరిచారు. మూల్యాంకనానికి 650 మందిని ఏఈ (అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు)గా నియమించారు. 250 మందిని సీఈ (చీఫ్‌ ఎగ్జామినర్‌)లుగా నియమించారు. 200 మందిని స్పెషల్‌ అసిస్టెంట్లుగా తీసుకున్నారు.

ఎనిమిది మంది అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లను నియమించారు. డెప్యూటీ క్యాంపు ఆఫీసర్‌ (అడ్మిన్‌)గా డీవైఈఓ శ్రీదేవి వ్యవహరిస్తారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ డెప్యూటీ క్యాంపు ఆఫీసర్‌ (స్ట్రాంగ్‌రూం)గా వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ క్యాంపు ఆఫీసర్‌గా ఉంటారు. ఆర్జేడీ రాఘవరెడ్డి పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఉదయం 9 గంటలకు క్యాంపు ప్రారంభమవుతుందని అందరూ విధిగా వచ్చి రిపోర్ట్‌ చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మీ సూచించారు.

58 ఏళ్లకు పైబడిన వారికి మినహాయింపు..

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌) విధులకు 58 ఏళ్లకు పైబడిన టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. పేపర్లు దిద్దేందుకు ఎవరికై నా ఆసక్తి ఉంటే వారిని విధులకు తీసుకుంటారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి మినహాయింపు ఇచ్చారు. ఎవరికై నా అనారోగ్య సమస్య ఉండి ఇబ్బందిగా ఉంటే సంబంధిత సర్టిఫికెట్లు చూపిస్తే మినహాయింపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

పూర్తి స్థాయిలో వసతులు..

ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాంపులో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చల్లని తాగునీరు, ఫ్యాన్లు, లైటింగ్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కువమంది విధుల్లో ఉంటుండడంతో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

Also Read : AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

 

 

 

#Tags