YS Jagan Mohan Reddy: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. ఈ విద్యార్థుల మధ్య సీఎం జన్మదిన వేడుకలు

సాక్షి, విశాఖపట్నం : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి జీటీడబ్ల్యూహెచ్‌ స్కూల్లో విద్యార్థులకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం డిసెంబ‌ర్ 21న‌ అట్టహాసంగా జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ట్యాబ్‌ పంపిణీ, ‘నాడు – నేడు’లో భాగంగా రెండో విడత ఐఎఫ్‌ బీ ప్యానళ్లను విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన దిగ్విజయంగా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత చింతపల్లి ప్రాంతానికి సీఎం తొలిసారిగా విచ్చేశారు. అదీ ఆయన పుట్టినరోజున ఇక్కడకు విచ్చేసి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు ఉప్పొంగిపోయారు.

చదవండి: AP Govt: చదువుకు తగిన ఉద్యోగం ప్రభుత్వ లక్ష్యం

అడుగడుగునా నీరాజనం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. విద్యార్థులంతా పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, నాడు–నేడు పథకంలో జరిగిన అభివృద్ధి, విద్యార్థులకు అందించిన సంక్షేమ పథకాలను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వివరించారు.

పోటీ ప్రపంచంలో రాణించాలి: సీఎం జగన్‌

పోటీ ప్రపంచంలో ఏపీ విద్యార్థులు రాణించాలని, తమ ప్రభుత్వంలో 55 నెలల పాలనలో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సభావేదికపై ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వాటిని అందిపుచ్చుకుని రెట్టింపు అబ్డేట్‌ అవుతూ..రాణించాలని సూచించారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌’ ఐబీ స్కిల్స్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వంలో విద్యారంగాన్ని పటిష్టం చేయడంతో ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు సైతం పోటీపడుతున్నాయన్నారు. ఆయన మాట్లాడినంత సేపు విద్యార్థులు కేరింతలతో.. జగన్‌ మామ అని..ప్రజలు జై జగనన్న అని నినాదాలు చేశారు.

గిరిజన విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు

చింతపల్లి జీటీడబ్ల్యూహెచ్‌ స్కూల్‌ గిరిజన విద్యార్థుల మధ్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు తినిపించారు. విద్యార్థులు అందరూ ‘హ్యాపీ బర్త్‌ డే జగన్‌ మామయ్య’ అంటూ సీఎంకు కేక్‌ తినిపించారు.

#Tags