AP Govt: చదువుకు తగిన ఉద్యోగం ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా
- నన్నయ వర్సిటీలో మెగా జాబ్‌మేళా
రాజానగరం: రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడమే కాదు.. అందుకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ సహకారంతో పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా నిర్వహించారు. దీనిని సందర్శించిన ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, పిల్లలను ఉన్నత చదువులు చదివించి, మంచి ఉద్యోగం పొందాలని ఆకాంక్షించే తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సుమారు ఆరున్నర లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు.
కుల, మత, రాజకీయ వివక్షకు తావు లేకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రంలో సువర్ణ పరిపాలనను అందిస్తున్న సీఎం జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రగతిలో చిరస్థాయిగా నిలచిపోవాలని, మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగానే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. విప్రో, టెక్ మహీంద్ర, త్రెడ్జ్ ఐటీ, ఎన్‌లైట్ టెక్నాలజీస్, అపోలో ఫార్మసీ, హెటిరో, కిమ్స్ ఆస్పత్రి, వరుణ్ మోటార్స్ వంటి 30 కంపెనీల వరకు ఈ మేళాలో పాల్గొన్నాయని జక్కంపూడి గణేష్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ విద్యార్హతలున్న అభ్యర్థులు భారీ ఎత్తున హాజరయ్యారని, ఆయా కంపెనీల అవసరాలను బట్టి ఎంపికలు జరుగుతాయని వివరించారు. మేళాకు హాజరైన నిరుద్యోగులకు, వారి వెంట వచ్చిన వారికి క్యాంపస్‌లోనే భోజన సదుపాయం కల్పించామని ఎమ్మెల్యే రాజా చెప్పారు. కాగా, ఈ మేళాకు 3643 మంది అభ్యర్థులు హాజరు కాగా, 831 మందికి నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి ఎమ్మెల్యే రాజా తదితరులు సాయంత్రం ఎంపిక పత్రాలు ఇవ్వడంతో పాటు సీఎం జగన్ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేసి, సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్యకె.పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.