Child Rights Commission: పాఠశాల యాజమాన్యంపై కమిషన్‌ ఆగ్రహం

పర్చూరు (చినగంజాం): స్కూలులో తమను వేధిస్తున్నారని, ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థినులు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ముందు వాపోయారు.

 పాఠశాలకు వచ్చేటప్పుడు కొందరు ఆకతాయిల ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి న‌వంబ‌ర్ 9న‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం కారు ఎక్కబోతున్న పద్మావతి వద్దకు విద్యార్థినులు ఏడ్చుకుంటూ వెళ్లారు. పాఠశాలలో జరుగుతున్న ఇబ్బందులు గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు.

బయాలజీ టీచర్‌ తమను విపరీతంగా కొడుతుందని మోకాళ్ల మీద నిలబెడుతుందని తెలిపారు. పాఠశాలకు వచ్చేటప్పుడు కొందరు ఆకతాయిలు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని వాపోయారు. అంతటితో కారు దిగి వచ్చిన పద్మావతి స్కూల్‌ అసిస్టెంట్‌ ఫాదర్‌ భాను డేవిడ్‌ను పిలిచి వివరణ అడిగారు. అతడిచ్చిన వివరణతో సంతృప్తి చెందక స్థానిక ఎంఈవో సత్యనారాయణ, సీడీపీఓ సుభద్రతో కలిసి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు, విద్యార్థులను హింసించడం మానుకోవాలని ఉపాధ్యాయులకు హితవు చెప్పారు.

చదవండి: Himabindu Singh: మెడికల్‌ కాలేజీలో వీడియో చిత్రీకరణపై కేసు

పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటశాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర మొత్తం అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థుల హక్కులకు భంగం కలిగినప్పుడు 1098 నంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు. అనంతరం ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఫ్రిన్సిపాల్‌ పీ విశ్వరాణి, గ్రామ కార్యదర్శి ఈఎం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags