AP SSC 10th Class Reevaluation And Recounting Schedule: పది ఫలితాలు..రీ వెరిఫికేషన్‌,రీ కౌంటింగ్‌కు అప్లై చేస్తున్న వారికి ముఖ్య సూచనలు


పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునఃమూల్యాంకనం (రీ వెరిఫికేషన్‌) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఏడాది పది పరీక్షలు రాసిన విద్యార్థులు పాసైనా/ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్‌/రీ కౌంటింగ్‌ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30వ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రీ వెరిఫికేషన్‌/రీ కౌంటింగ్‌ ఫలితాలు వచ్చినా, రాకున్నా ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ కౌంటింగ్‌/రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌ఎంకి మాత్రమే ఫీజును సమర్పించాలి. అన్ని రుసుము చెల్లింపులు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో మాత్రమే చేయాలి. శ్రీసీఎఫ్‌ఎంఎస్‌ సిటిజన్‌ చలాన్‌ ద్వారా ఫీజు చెల్లింపులు ఆమోదించరు.

ముఖ్య సూచనలు
అభ్యర్థులు వారి దరఖాస్తులను సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు అటెస్టేషన్‌ చేయించి, సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. నేరుగా విజయవాడలోని డీజీఈ కార్యాలయం(ఎస్‌ఎస్‌సీ బోర్డు)కు పంపించరాదు. దరఖాస్తులు పోస్టు ద్వారా స్వీకరించరు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రీ వెరిఫికేషన్‌ అంటే పరీక్ష పేపర్లను తిరిగి మొత్తం మూల్యాంకనం చేయరు. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కిస్తారు. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధ్రువీకరిస్తారు. జవాబు పత్రంలో దిద్దని ప్రశ్నలు ఉంటే దిద్ది మార్కులు కేటాయిస్తారు. స్కానింగ్‌ చేసిన విద్యార్థి జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అందిస్తారు. రీ కౌంటింగ్‌ విషయంలో మార్కుల మొత్తం మరోసారి కూడతారు. తప్పుగా కూడి ఉంటే సరి చేసి మార్కులు వేస్తారు. అంతేగాని పేపరు విద్యార్థికి ఇవ్వరు.


అడ్వాన్స్‌ సప్లిమెంటరీ దరఖాస్తు ఇలా..
మే 24వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు త్వరలో ప్రకటించనుంది. వచ్చే నెలలో నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రీ కౌంటింగ్‌/రీ వెరిఫికేషన్‌ కోసం విద్యార్థులకు ప్రతీ పాఠశాల హెచ్‌ఎం/సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ఫీజును నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించే వీలుంది. శ్రీమే ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50ల అపరాధ రుసుంతో ఫీజును చెల్లించే వీలుంది.

నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలు
ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ కోర్సుల్లో చేరేందుకు నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత హెచ్‌ఎం స్కూల్‌ లాగిన్‌ నుంచి పాఠశాలల వారీగా మార్కుల మెమొరాండం, వ్యక్తిగత షార్ట్‌ మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌ఈఎస్‌యుఎల్‌టీఎస్‌.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ నుంచి ఫలితాలు, షార్ట్‌ మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు. మార్చి–2024, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల నామినల్‌ రోల్‌ ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఫీజుల వివరాలు
చెల్లించాల్సిన ఫీజులను ఆన్‌లైన్‌లో ఆయా పాఠశాల హెచ్‌ఎం లాగిన్‌ ద్వారా చెల్లించాలి. డీడీలు స్వీకరించరు. శ్రీరీ వెరిఫికేషన్‌ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. శ్రీరీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి.

#Tags