Youth employment: యువత ఉపాధే సర్కారు లక్ష్యం

శృంగవరపుకోట: ఎస్‌.కోట పట్టణంలో కొత్త ఉపాధికి బాటలు పడుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలతో ముందుకొచ్చిన జిందాల్‌ కంపెనీకి తమవంతు సహకారం అందిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. జిందాల్‌ యాజమాన్యం అడిగిన రాయితీలు అందించేందుకు అంగీకరించింది. రాయితీలను భరించైనా యువతకు ఉపాధి మార్గం చూపడమే లక్ష్యంగా సర్కారు యత్నిస్తోంది.

ముందుకొచ్చిన జిందాల్‌
2008లో ఎస్‌.కోట మండలంలోని అల్యూమినా రిఫైనరీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు జిందాల్‌ కంపెనీ సిద్ధమైంది. నాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సర్కారు 985.70ఎకరాల భూమిని కేటాయించింది. తర్వాత అల్యూమినా రిఫైనరీ కర్మాగారానికి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకపోవడంతో రిఫైనరీ ఏర్పాటును జిందాల్‌ విరమించుకుంది. దీంతో ప్రభుత్వం కేటాయించిన భూమి నిరుపయోగంగా ఉంది. ఇటీవల జిందాల్‌ తమకు కేటాయించిన స్థలంలో యువత ఉపాధి కోసం 1166 ఎకరాల్లో రూ.531.36కోట్ల పెట్టుబడులతో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

చ‌ద‌వండి: Free Coaching : ఉచిత సివిల్స్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

యువత ఉపాధే సర్కారు లక్ష్యం
జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు ప్రధానంగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఎంఎస్‌ఎంఈ ఏర్పాటుకు అనుమతిస్తూ జిందాల్‌ కోరిన రాయితీలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. జిందాల్‌ భూసేకరణలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలు, స్థానికంగా ఉన్న వేలాదిమంది యువతకు జిందాల్‌ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కు రావడంతో ఉపాధి అవకాలు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 15వేల మంది, పరోక్షంగా మరో 10వేల మందికి ఉపాధి దారి దొరకనుంది. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, రవాణా అనుబంధ రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయి.

మంచి ఆలోచన :
జిందాల్‌ కోసం వందల ఎకరాల భూములు ఇచ్చి ఉపాధి లేక చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎట్టకేలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈది చాలా సంతోషించాల్సిన విషయం. దీనివల్ల జిందాల్‌ నిర్వాసితులకు ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
–దేవాపురపు మీనా, బొడ్డవర సర్పంచ్‌

చక్కని ప్రయత్నం
జిందాల్‌ కంపెనీ వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాం. కానీ అది జరగలేదు. ఇప్పటికై నా ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని జిందాల్‌ ముందుకు రావడం సంతోషం. పార్కు వస్తే ఈప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
–డి.శంకర్‌, బొడ్డవర

ఇదీ సీఎం విజన్‌
జిందాల్‌ భూసేకరణలో అక్రమాలు జరిగిపోయాయంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్‌ కో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్‌పై పెదవి విప్పలేదు, సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు. ఇప్పుడు యువత ఉపాధి కోసం జిందాల్‌ కోరిన రాయితీలు కల్పించైనా ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభించాలనే పట్టుదలతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారు.
– కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే. ఎస్‌కోట

#Tags