Anganwadi Children Free News: తెలంగాణలో చిన్నారులకు ఉచితం..ఏమిటంటే
మిర్యాలగూడ టౌన్: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలమని, పాఠశాలల్లో చేరేనాటికి అక్షరాలు, అంకెలు నేర్పి, ఆటాపాటలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Anganwadis Free Tabs News: గుడ్‌న్యూస్ అంగన్‌వాడీలకు ఉచిత 5G ట్యాబ్‌లు Click Here
రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు సోమవారం నుంచి వారం రోజుల పాటు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
దీంట్లో భాగంగా ఈనెల 20న సామూహిక అక్షరాబ్యాస కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
● ఈనెల 15, 16 తేదీల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, స్వయం సహాయ సంఘాలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యువత, ఎన్‌జీవోస్, తల్లిదండ్రులు గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు.
● 17న రెండున్నరేళ్ల వయస్సు దాటిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో చేర్పిస్తారు. పాఠశాల, కళాశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను కూడా గుర్తించి, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
● 18న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించాలి. పూర్వ ప్రాథమిక విద్య అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన పద్ధతులు, పాఠశాల విద్యకు సమాయత్తం చేసే అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
● 19న స్వచ్ఛ అంగన్‌వాడీ పేరుతో కేంద్రాలను శుభ్రంగా తీర్చిదిద్దుతారు. వాటి చుట్టూ మొక్కలను నాటుతారు. కిచెన్ గార్డెన్, తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలు ఉండేలా చర్యలు చేపడతారు.
● 20న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్లీ చైల్డ్ హుడ్ కేర్ డెవలప్‌మెంట్ డే, సాముహిక అక్షరాబ్యాసం నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాతలు, నానమ్మలు, బామ్మలను ముఖ్య అతిథులుగా పిలిచి పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహాన కల్పిస్తారు. కేంద్రాలకు సరఫరా అయినా బోధన, ఆటవస్తువులను ప్రదర్శించి చూపిస్తారు.
కార్యక్రమం విజయవంతానికి సహకరించాలి
ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటాపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి. –సక్కుబాయి, ఐసీడీఎస్ పీడీ నల్లగొండ