Anganwadi news: ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

Anganwadi news

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించడమే కాక అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. నూతన విద్యాచట్టానికి అనుగుణంగా ప్రాథమిక దశలోనే చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మార్చేందుకు సిద్ధమైంది.

తద్వారా జిల్లాలోని 1,840 అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలో విద్య అందనుంది. ఇందుకోసం ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు.

Junior Lineman jobs news: జూనియర్‌ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)ఎంపిక పరీక్ష ఎప్పుడంటే..


తొలిదశలో ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ తరహా విద్యా విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాక.. దశల వారీగా అన్ని కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మారుస్తారు.

ఈ నిర్ణయంతో ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి.

పుస్తకాలు, యూనిఫామ్‌ సిద్ధం

జిల్లాలో ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 1,840 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తొలిదశలో 771 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మారుస్తారు. ఇందుకోసం పుస్తకాలను ఇప్పటికే ప్రభుత్వం జిల్లాకు పంపించింది.

ఆటపాట లతో పాటు, మన దేహాం – మన పరిసరాలు తదిత ర అంశాలతో కూడిన ఈ పుస్తకాలను క్లస్టర్ల వారీగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మాదిరిగా అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇచ్చేందుకు యూనిఫామ్‌ క్లాత్‌ పంపించారు.

యూనిఫామ్‌ కుట్టించే బాధ్యతను డీఆర్డీఓ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. 10వేల మంది చిన్నారులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌ను దఫాలుగా అందిస్తారు.

36,971 మంది చిన్నారులకు లబ్ధి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఆరేళ్ల లోపు చిన్నారులు 36,971 మంది ఉన్నారు. కొత్త విధానం ద్వారా చిన్నారులకు ప్రాథమిక విద్య అందనుంది. ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు క్లస్టర్ల వారీగా జిల్లా నుండి 11మంది సూపర్‌వైజర్లను ఎంపిక చేసి ఇప్పటికే హైదబాద్‌లో శిక్షణ ఇచ్చారు.

వీరు మాస్టర్‌ ట్రెయినీలుగా బుధవారం నుండి జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. 35 మంది టీచర్లను గ్రూప్‌గా చేసి మూడేసి రోజులు శిక్షణ ఇప్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

పూర్వ ప్రాథమిక విద్య బోధించేందుకు ఏర్పాట్లు

11మంది మాస్టర్‌ ట్రెయినీల ద్వారా టీచర్లకు శిక్షణ

ఇప్పటికే చేరిన పుస్తకాలు.. ఈసారి చిన్నారులకు యూనిఫాం పంపిణీ

జిల్లాలో 36,971 మంది చిన్నారులకు లబ్ధి

వచ్చే నెల నుంచి బోధన

జిల్లాలో ప్రీ స్కూళ్ల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రెయినీల ద్వారా జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం.

బుధవారం ఐదు బ్యాచ్‌లకు శిక్షణ మొదలైంది. శిక్షణ పూర్తికాగానే ప్రాజెక్టుల వారీగా పుస్తకాలు, పిల్లలకు యూనిఫామ్‌ అందించి నూతన పాఠ్యప్రణాళిక ద్వారా బోధన ప్రారంభిస్తాం.

– రాంగోపాల్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ

#Tags