Purnima Shrestha: ప్రపంచంలోనే 13 రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళగా రికార్డ్‌...

పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది.  నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్‌ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.

 

‘ప్రపంచంలో ఒకే సీజన్‌లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.

ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్‌ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.

మూస పద్ధతికి స్వస్తి...
ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. 

Elon Musk Pay Package: ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవో.. జీతం ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్‌ కంపెనీ నుండి కొంత లోన్‌ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్‌ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్‌ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్‌ బ్రేక్‌ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. 

అలసట కలిగినా..
ఈ వసంత కాలంలో ఎవరెస్ట్‌ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.

నిద్రలేపడానికి గైడ్‌ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్‌ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. 

NEET-UG Exam Row: తప్పు జరిగితే ఒప్పుకుని సరిదిద్దుకోండి.. NTA తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

కలల సాధనకు కృషి
స్కూల్‌ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్‌ మారథాన్‌ కవర్‌ చేసే ఫొటోగ్రఫీ అసైన్‌మెంట్‌ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. 

చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్‌ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను.

Centre Warning To Its Employees: ఆఫీసులకు లేటుగా వెళ్తున్నారా? ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్‌ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.

ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి.

#Tags