Twin Sisters Scored Top Ranks In CA Final Exam- సీఏ పరీక్షల్లో ఆల్‌ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన అక్కాచెల్లెళ్లు

మన దేశంలో నిర్వహించే అత్యంత కష్టమైన పరీక్షల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ)కూడా ఒకటి. ఇందులో ఉత్తీర్ణత పొందడం అంత సులభ​ం కాదు. కొందరైతే సీఏ ఫైనల్స్‌లో ఉత్తీర్ణత పొందేందుకు ఎన్నోసార్లు పరీక్ష రాస్తుంటారు. అయితే తాజాగా చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షల్లో ముంబైకి చెందిన అక్కాచెల్లెళ్లు టాప్‌-10లో చోటు సంపాదించి సత్తా చాటారు. వారే ముంబైకి చెందిన కవలలు సంస్కృతి, శ్రుతి.

మొదటి ప్రయత్నంలోనే..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) గతేడాది నవంబర్‌లో నిర్వహించిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల ఫలితాలను ఇటీవలె విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సంస్కృతికి ఆల్‌ ఇండియాలో రెండో ర్యాంకు రాగా, శ్రుతికి ఎనిమిదో ర్యాంకు వచ్చింది. అంతేకాకుండా మొదటి ప్రయత్నంలోనే ఆ అక్కాచెల్లెళ్లు ఈ ఘనతను సాధించడం విశేషం.

కలిసే చదివారు, సీఏ కొట్టారు
కాగా సీఏ ఫలితాల్లో జైపూర్‌కు చెందిన మధుర్ జైన్ 800 మార్కులకు గాను 619 మార్కులు సాధించి ఆల్‌ఇండియాలోనే మొదటి ర్యాంకును సాధించాడు. సంస్కృతి 599 (74.88 శాతం) స్కోర్ చేసి రెండవ ర్యాంక్ సాధించింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ముంబైలోని బోరివాలిలోని మేరీ ఇమ్మాక్యులేట్ గర్ల్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత నర్సీ మోంజీ కళాశాల నుంచి బీకామ్‌ పూర్తి చేశారు.

స్పోర్ట్స్‌ దగ్గర్నుంచి చదువుకోవడం వరకు అన్ని విషయాల్లోనూ ఒకరికి ఒకరం సహకారం అందించుకుంటామని, అన్ని విషయాలను పంచుకుంటామని తెలిపారు. కాగా ఈ కవలల తండ్రి, సోదరుడు కూడా సీఏలే కావడం విశేషం.

సీఏతో కొలువులు
సీఏ కోర్సులో మూడు దశలు ఉన్నాయి. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌.సీఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. వీరికి కార్పొరేట్ సంస్థల్లో.. చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్స్ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్, వాల్యుయర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్‌లుగానూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సీఏ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి మార్గం కూడా ఉంది. ప్రాక్టీసింగ్ సీఏగా సొంతంగా కన్సల్టెన్సీని స్థాపించి.. ఆయా సంస్థలకు అకౌంటింగ్ సలహాదారులుగా ఉండొచ్చు. 

 

#Tags