Teacher Transfers: పూర్తయిన టీచర్ల పదోన్నతులు, బదిలీలు.. అడ్డంకిగా మారిన రేషనలైజేషన్ నిబంధనలు
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఎస్జీటీల బదిలీ సోమవారం ముగిసింది. గతేడాది సెప్టెంబర్‌లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీ, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు, బదిలీతో ప్రారంభమైంది. ఎీస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా పదోన్నతుల నేపథ్యంలో టెట్ తెరపైకి రావడం.. హైకోర్టు తీర్పుతో ప్రక్రియ ఆగిపోయింది.
ఈ ఏడాది ఎన్నికల నియమావళి కారణంగా నిలిచిన బదిలీలు, పదోన్నతులకు కోడ్ ముగియగానే జూన్ 8నుంచి 22 పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రకటించింది. పదవీ విరమణకు మూడేళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి మినహాయింపు ఇచ్చింది. జూన్ 22 వరకు బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా కోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కారణాలతో ఆగుతూ.. సాగుతూ వచ్చింది.
Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే
గత వారం రోజులుగా ఎస్జీటీలు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. బదిలీల వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ శనివారం రాత్రి 11గంటల నుంచి ఆదివారం రాత్రి 10గంటల వరకు కొనసాగించారు. మరో మూడు గంటల వరకు అంటే అర్ధరాత్రి 1గంట వరకు ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ పూర్తికాగా సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారుల వెరిఫికేషన్ల అనంతరం బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటితో తెలుగు, హిందీ, పీఈటీ బదిలీల ఆర్డర్ కాపీ రావడంతో తీవ్ర జాప్యం జరిగినా రాత్రి పూర్తి కావడంతో టీచర్ల బదిలీలకు తెరపడింది.
బదిలీ అయినట్లా.. కానట్లా..?
స్థానిక గోపాల్‌వాడ ప్రభుత్వ పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. టీచర్లు బదిలీపై వెళ్లే అవకాశం లభించినా రేషనలైజేషన్ నిబంధనలు అడ్డుగా మారాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉంటుంది.
బదిలీపై వచ్చిన వారు చేరే వరకు వీరిని విడుదల(రిలీవ్) చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ హేతబద్ధీకరణ నిబంధనల ప్రకారం కనీస ఉపాధ్యాయుల సంఖ్య ఉన్నట్లయితే సీనియర్ ఉపాధ్యాయుడు మాత్రమే రిలీవ్ అవుతారు. జిల్లాలో 50శాతం మించి ఉపాధ్యాయులు బదిలీ అయినా పాఠశాలలకు విడుదల కావడం కష్టమే.
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా నియామకాలు చేపట్టి ఉపాధ్యాయులు వస్తే తప్ప రిలీవ్ అయ్యే అవకాశం లేదు. ప్రతీ పాఠశాలలో సింగిల్ టీచర్లు ఉన్నారు. మంచిర్యాల మండలంలోనే దాదాపు 13కుపైన పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయినా.. కానట్లేనని తెలుస్తోంది.