New Education Policy: 2030 తరువాత బీఎడ్‌ కోర్సు ఉండదు

ఎచ్చెర్ల క్యాంపస్‌: నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో 2030 తరువాత బీఎడ్‌ కోర్సు ఉండదని, నిపుణులైన ఉపాధ్యాయులను తయారు చేసే నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యా కోర్సు మాత్రమే ఉంటుందని అంబేడ్కర్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి విశ్వవిద్యాలయంలో బీఎస్సీబీఎడ్‌ (ఎంపీసీ), బీఏబీఎడ్‌ (హెచ్‌ఈపీ) సబ్జెక్టులతో కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 100 సీట్లు అందుబాటులో ఉంటాయని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్ష నిర్వహణ తరువాత ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని వివరించారు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులు అర్హత బట్టి ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత డిగ్రీతో రిలీవ్‌ కావచ్చునని, నాలుగేళ్ల తరువాత డిగ్రీతో కలిపి బీఎడ్‌ అర్హత ధ్రువీకరణ పత్రం అందజేయనున్నట్లు చెప్పారు. ప్రయోగ విద్య, క్షేత్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ కోర్సు నిర్వహణకు అనుమతి ఇచ్చిందన్నారు.

Govt Degree College: డిగ్రీ విద్యార్థులకు చదరంగం పోటీలు


తైక్వాండో పోటీల్లో సిక్కోలు కుర్రాడి ప్రతిభ
​​​​​​​

ఆమదాలవలస రూరల్‌ : బ్యాంకాక్‌ థాయిలాండ్‌లో జులై 15 నుంచి జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో సిక్కోలు కుర్రాడు ప్రతిభ కనబరిచాడు. ఆమదాలవలస మండలం అక్కులపేటకు చెందిన గురుగుబెల్లి సుబ్బారావు 80 కిలోల కేటగిరీ కయోరుజీ విభాగంలో బంగారు పతకం సాధించాడు. మొత్తం 8 దేశాల నుంచి క్రీడాకారులు హాజరైన ఈ పోటీల్లో 31–40 ఏళ్ల వ్యక్తిగత విభాగంలో పతకం సాధించి సత్తాచాటాడు. పూమ్‌సేయ్‌ విభాగంలోనూ సిల్వర్‌ మెడల్‌ దక్కించుకున్నాడు. ఈయన తల్లిదండ్రులు వెంకటరమణ, కృష్ణవేణి వ్యవసాయ కూలీలు. సుబ్బారావుకు క్రీడలపై ఆసక్తి ఉన్నందున హైదరాబాద్‌లోని సోమా పిట్‌ వరల్డ్‌ తైక్వాండో అకాడమీలో శిక్షణ ఇప్పించారు.ఇంజనీరింగ్‌ చదువుతూనే పోటీల్లో పాల్గొంటూ గతంలో బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, కొరియాలో రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆశిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.

#Tags