Inspection in Schools: పాఠాలు విద్యార్థులకు అర్ధమవుతున్నాయో లేదో ప్రతి రోజూ గమనించాలి

యలమంచిలి (అనకాపల్లి రూరల్‌)/నక్కపల్లి/ఎస్‌.రాయవరం: ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్నా కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఆశయం కుంటుపడుతోందని పాఠశాల విద్య విశాఖ జోన్‌ ఆర్‌జేడీ ఎం.జ్యోతికుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుధవారం యలమంచిలి, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు హైస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వర్క్‌బుక్స్‌ నిర్వహణను పరిశీలించారు. యలమంచిలి పట్టణంలోని కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో కొందరు విద్యార్థులు యూనిఫాంతో పాఠశాలకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోతే వారికి క్రమశిక్షణ ఎలా అలవడుతుందని ప్రశ్నించారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి ఎంపీపీ స్కూల్లో ఒకటో తరగతి ఉపాధ్యాయుడు రామకృష్ణ విద్యార్థుల వర్క్‌బుక్‌లను సరిగ్గా దిద్దకపోవడంతో అతడికి మెమో జారీ చేయాలని ఎంఈవోను ఆదేశించారు. నక్కపల్లి కేజీబీవీ పాఠశాలలో స్టడీ అవర్స్‌ ఎలా జరుగుతున్నాయో పదో తరగతి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లిప్‌ అమలవుతున్న తీరు పరిశీలించి చిన్నారులకు పలు సూచనలు చేశారు. ఏటికొప్పాక ఎంపీపీ స్కూల్‌, హైస్కూళ్లను తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలు బాగులేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల తనిఖీ అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై.. పాఠాలు విద్యార్థులకు అర్ధమవుతున్నాయో లేదో ప్రతి రోజూ గమనించాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుల బోధనా తీరును మార్చుకోవాలని సూచించారు. ఆర్‌జేడీ పర్యటనలో యలమంచిలి ఎంఈవోలు వై.మీనాక్షి,మూర్తి, అప్పారావు, రిసోర్సు పర్సన్‌ సుసర్ల సూర్య ప్రకాష్‌, హెచ్‌ఎంలు వైవీ రమణ, కాండ్రేగుల సూర్యనారాయణ, ఎస్‌.రాయవరం మండల ఎంఈవోలు మూర్తి, అప్పారావు, నక్కపల్లి ఎంఈవో కె.నరేష్‌ పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Nadu Nedu Scheme: రూ.310 కోట్లతో 447 జూనియర్‌ కళాశాలల అభివృద్ధి

#Tags