Health Minister Harish Rao: మెడికల్‌ కాలేజీకి యాదాద్రీశుడి పేరు!

సాక్షి యాదాద్రి, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్‌ కళాశాలను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ప్రాశస్త్యం చాటేలా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా కళాశాలకు యాదాద్రీశుడి పేరు నామకరణం చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెడికల్‌ కళాశాల ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, హెల్త్‌ సెక్రటరీ రిజ్వి, కలెక్టర్‌ పమేలా సత్పతితో కళాశాల ఏర్పాటు, స్థలం ఎంపికపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి క్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేసిందని, దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, భక్తుల రద్దీ, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో మెడికల్‌ కళాశాల నిర్మించాలని నిర్ణయించారు. యాదాద్రి ప్రాశస్త్యాన్ని చాటేలా కళాశాల నిర్మాణం జరగాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. అత్యవసర సేవలు సహా 35 పైగా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి వివరించారని విప్‌ సునీత తెలిపారు. త్వరలోనే కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. కళాశాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలను మంత్రి మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. సమీక్షలో ఈఎన్‌సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

 

MCC: వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం.. రాష్ట్రంలో సీట్లకు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

#Tags