GATE Ranker : గేట్‌లో ఉత్తమ ర్యాంకుతో ఉన్నత స్థానానికి.. జాతీయ స్థాయిలో..
వింజమూరు: ప్రతిభకు పేదరికం అడ్డురాదని వింజమూరుకు చెందిన పేద విద్యార్థి తిప్పిరెడ్డి శ్రీను నిరూపించారు. పట్ణణంలో సాధారణ కుటుంబంలో పుట్టిన శ్రీను చిన్నతనం నుంచి చదువులో ఉత్తమ ప్రతిభ చూపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా, గేట్‌లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించి ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ 8వ తరగతిలో ఎన్నెమ్మెమ్మెస్ స్కాలర్‌షిప్ సాధించి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇంటర్ వరకు పొందారు. 2017 – 18లో పదో తరగతిలో 10 జీపీఏ సాధించి అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు చేతుల మీదుగా ప్రతిభ అవార్డును అందుకున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బెస్ట్ అవుట్‌గోయింగ్ విద్యార్థిగా అవార్డును అందుకున్నారు. 2024 గేట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 224వ ర్యాంక్‌తో ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ సీటు సాధించారు. గేట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో రూ.20 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను వింజమూరులో ఉపాధ్యాయ బృందం సత్కరించింది.