Degree Admissions 2024: డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 1వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 142 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సైన్‌న్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో సుమారు 4,500 వరకు సీట్ల భర్తీకి అవకాశం ఉంది.

చదువు మానేసినా సర్టిఫికెట్‌ కోర్సు
విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్‌ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్‌ కోర్సు పేరుతో సర్టిఫికెట్‌ పొందవచ్చు. రెండేళ్లు అయితే డిప్లొమా సర్టిఫికెట్‌, మూడేళ్లు అయితే డిగ్రీ సర్టిఫికెట్‌, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా మధ్యలో చదువు మానేసేందుకు వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.

Study Abroad: విదేశీ విద్య.. స్కాలర్‌షిప్‌ పొందడమెలా? టోఫెల్‌ స్కోర్‌తో అక్రమాలు..ఈ విషయాల గురించి తెలుసా?

ఫస్టియర్‌ నుంచి నాలుగేళ్లలోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్ల లోపు తిరిగి ప్రవేశం పొంది విద్యాభ్యాసం కొనసాగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్‌ మేజర్‌ ఆనర్స్‌ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గత విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతోంది.

నిబంధనలకు అనుగుణంగా సీట్లు
డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్‌లో కామర్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వారికి బీఏ సీట్లలో 50 శాతం సీట్లు కేటాయిస్తారు. తక్కిన 50 శాతం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ సాధారణ కోర్సులతో పాటుగా, కంప్యూటర్‌, మార్కెట్‌ ఓరియంటెడ్‌, స్కిల్‌ ఓరియంటెడ్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు www.aprche.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు దగ్గర్లో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌కు చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకూ, కంప్యూటర్‌ కోర్సులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు ఉంటుంది.

TG EAPCET Counselling 2024: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభం.. తొలి దశ కౌన్సెలింగ్‌ ఇలా..

 

నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు
జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు ప్రవేశ పెట్టింది. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులను అమలు చేస్తున్నారు. ఈ కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్‌ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే మేజర్‌ సబ్జెక్టు ఉంటుంది. దీన్ని సింగిల్‌ మేజర్‌ డిగ్రీ కోర్సుగా పిలుస్తారు.

ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్‌ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్‌ సబ్జెక్టుగా ఎంచుకుని చదువుకోవాలి. ఇంటర్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌ సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టునైనా మైనర్‌ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.

అత్యున్నత ప్రమాణాలు
ఇంటర్‌, తత్సమాన విద్యార్హత ఉన్న వారు డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలతో మా కళాశాలలో బోధన ఉంటుంది. జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, ప్లేస్‌మెంట్‌ సెల్స్‌ ఉన్నాయి. అడ్మిషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్‌ పి.జీవనజ్యోతి, ప్రిన్సిపల్‌,ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చిత్తూరు

సద్వినియోగం చేసుకోవాలి
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తక్కువ ఫీజులతో, అన్ని రకాల సౌకర్యాలతో చదువుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉంది. పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో అత్యధిక మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు.
– డాక్టర్‌ వై.రాజశేఖర్‌, ప్రిన్సిపల్‌,ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుంగనూరు

#Tags