Basara IIIT Admissions: బాసర ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యాసంవత్సరానికి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హాల్‌టికెట్‌ నంబర్‌, పేరు తదితర వివరాలు ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతాయి. జూన్‌ 1నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ ఏడాది 1,500 సీట్లు..
బాసర ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ట్రిపుల్‌ఐటీ వీసీ, ప్రొఫెసర్‌ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది 1,500 సీట్లు భర్తీ చేయనున్నారు. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీచేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని వీసీ వెంకటరమణ తెలిపారు. వివరాల కోసం www. rgukt. ac. in లేదా 7416305245, 7416058245, 7416929245 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆన్‌లైన్‌ సెంటర్లలో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ తెరవగానే నమోదు చేయాల్సిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. జీపీఏ ఆధారంగా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను చూసి అడ్మిషన్‌ కమిటీ సీట్లు కేటాయించనుంది.

వేల సంఖ్యలోనే ట్రిపుల్‌ఐటీకి దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో కేటగిరీల వారీగా సీట్లు భర్తీచేస్తారు. విద్యార్థుల జీపీఏ, సామాజికవర్గం, ఇతర వివరాలు తెలుసుకుని సీట్లు కేటాయిస్తారు. ఇతర ఏ వివరాలున్నా కళాశాలలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో గ్రామీణ విద్యార్థులకే ఎక్కువ సంఖ్యలో సీట్లు దక్కుతున్నాయి.

మొదటి రెండేళ్లు ఇంటర్‌ తత్సమాన పీయూసీ కోర్సు బోధిస్తారు. పీయూసీలో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయిస్తారు. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ ఐటీ, ఈసీఈఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు. సీట్లు దక్కించుకుని ప్రవేశం పొందిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చదువుకునే సమయంలో ల్యాప్‌టాప్‌, దుస్తులు, విద్యాసామగ్రి ఇస్తున్నారు. హాస్టల్‌, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తోంది.

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 1నుంచి 22 వరకు
  • స్పెషల్‌ కేటగిరీ విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను సమర్పించేందుకు గడువు జూన్‌ 29
  • ప్రొవిజన్‌ సీట్ల కేటాయింపు (స్పెషల్‌ కేటగిరీ కాకుండా) జూలై 3
  • సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జూలై 8

#Tags