Law Courses: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు

ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతున్న ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల బ్రోచర్‌ను గురువారం వైస్‌ చాన్సలర్‌ పి.రాజశేఖర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రెండు దశాబ్దాల తరువాత యూనివర్సిటీ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ కోర్సులను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో ప్రారంభించామన్నారు. ఈ ఏడాది బీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌, బీబీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌ కోర్సులకు అడ్మిషన్లు జరగనున్నాయని పేర్కొన్నారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు చొప్పున మొత్తం 120 సీట్లు ఉంటాయని వివరించారు. ఏపీ లాసెట్‌ నవంబర్‌ 17 నుంచి ప్రారంభించిన కౌన్సెలింగ్‌లో ఈ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్‌ ఆప్షన్స్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని క్యాంపస్‌ కళాశాలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. లా సెట్‌లో కళాశాలలోని సీట్లు ఏమైనా మిగిలి ఉంటే ఈ విద్యా సంవత్సరంలో ఏపీ లా సెట్‌ రాయని వారికి, ర్యాంకు సాధించి కళాశాలలో సీటు పొందని వారికి చివర్లో కేటాయించనున్నట్టు వెల్లడించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతోపాటు ఉద్యోగ విరమణ చేసిన న్యాయ నిపుణులు, న్యాయమూర్తులు ఏఎన్‌యూ న్యాయ కళాశాలలో తమ సేవలు అందించనున్నారని వివరించారు. బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ విభాగాధిపతి ఎల్‌.జయశ్రీ, డాక్టర్‌ శ్రీగౌరీ, డాక్టర్‌ రమణ, డాక్టర్‌ ఎన్‌.సతీష్‌, డాక్టర్‌ కిషోర్‌, ఎస్‌.చంద్రశేఖర్‌, అభిలాష్‌, శశి కిరణ్‌ పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Apprenticeship: అప్రెంటిస్‌తో ఉద్యోగ అవకాశాలు..

#Tags