Skip to main content

Medical College: నర్సింగ్‌ పరీక్షల్లో కాపీయింగ్‌

Mass Copying in nursing exams

కర్నూలు(హాస్పిటల్‌): స్థానిక మెడికల్‌ కాలేజీలోని ఆడిటోరియంలో ఈనెల 17 నుంచి ప్రారంభమైన నర్సింగ్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్చగా జరుగుతోంది. ఉమ్మడి కర్నూలు, వైఎస్‌ఆర్‌, అనంతపురం జిల్లాల నుంచి 51 నర్సింగ్‌ స్కూళ్లకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, చీఫ్‌ ఎగ్జామినర్‌గా సీఎస్‌ఆర్‌ఎంఓ, చీఫ్‌ ఇన్విజిలేటర్‌గా నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వ్యవహరిస్తున్నారు. మరో 20 మంది ఇన్విజిలేటర్లుగా నర్సింగ్‌ స్కూల్‌, ఆసుపత్రి పరిపాలన విభాగం ఉద్యోగులు ఉన్నారు. కాగా వీరు మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు నర్సింగ్‌ స్కూళ్ల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు ముడుతుండటంతోనే విద్యార్థులు చీటీలు పెట్టి పరీక్ష రాస్తున్నా ఇన్విజిలేటర్లు ఏమీ అనడం లేదని తెలుస్తోంది. అధికారులు సైతం ఈ పరీక్షల నిర్వహణ గురించి పట్టించుకోవడం లేదు. విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే పరమావధిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిరోజూ ఆసుపత్రి బయట ఉన్న జిరాక్స్‌ షాప్‌లో విద్యార్థులు మైక్రో పద్ధతిలో కాపీచీటీలను జిరాక్స్‌ చేయించుకుని పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్తున్నారు. నిబంధనల ప్రకారం మైక్రో కాపీలను జిరాక్స్‌ చేయడం చట్టవిరుద్ధం. అయినా రోజూ సదరు జిరాక్స్‌ షాప్‌లో మైక్రో జిరాక్స్‌ యథేచ్ఛగా సాగుతోంది.

చదవండి: MBBS Students: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు శుభవార్త

పరీక్ష కేంద్రం తనిఖీ..
ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.వెంకటరంగారెడ్డి, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ వి.వెంకటేశ్వరరావు బుధవారం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థుల వద్ద కాపీచీటీలు ఉండటం చూసి అవాక్కయ్యారు. కింది అంతస్తులో తనిఖీలు చేస్తుండగా పై అంతస్తు నుంచి విద్యార్థులు పదుల సంఖ్యలో కాపీచీటీలను కిందకు పడేశారు. దీన్ని బట్టి కాపీయింగ్‌ ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాపీయింగ్‌ యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శలున్నాయి.

మరో సారి కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్‌ చేస్తాం
కాపీయింగ్‌ విషయమై పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగారెడ్డిని వివరణ కోరగా.. తనిఖీలో కొందరు విద్యార్థుల వద్ద కాపీ చీటీలు లభ్యమయ్యాయన్నారు. వారిని హెచ్చరించి వదిలేశామని, మరోసారి కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్‌ చేస్తామన్నారు.

మెడికల్‌ కాలేజీలో జనరల్‌ నర్సింగ్‌ సప్లిమెంటరీ పరీక్షలు 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహణ చూచిరాతను ప్రోత్సహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బంది

Published date : 24 Aug 2023 03:17PM

Photo Stories