Medical College: ముస్తాబవుతున్న మెడికల్ కళాశాల
జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతంవరకు పూర్తి కావచ్చాయి.
చుట్టూ 42 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరిగోడ నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఆవరణలో పూలచెట్లు, గ్రీనరీ, శానిటేషన్, పార్కింగ్ షెడ్ల నిర్మాణం పనులు కూడా వేగవంతంగా చేపడుతున్నారు. భవన సమూదాయాన్ని అక్టోబర్ మాసం చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం సెప్టెంబర్‌లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.
2019లో కళాశాల మంజూరు..
2019 విద్యా సంవత్సరంలో నల్లగొండ మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైనప్పటికీ సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తరగతులను నిర్వహిస్తున్నారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో కళాశాల నిర్మాణం కోసం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ఎస్‌ఎల్‌బీసీలోని 42 ఎకరాల స్థలంలో కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాల భవనాన్ని జీ ఫ్లస్ 3గా నిర్మిస్తున్నారు.
చదవండి: Girls Gurukul Admissions: మైనార్టీ గురుకులంలో పరీక్ష లేకుండానే ప్రవేశాలు!
700 మంది విద్యార్థులకు వసతి ఉండే విధంగా బాలుర హాస్టల్ భవనాన్ని జీ ప్లస్4గా, బాలికల హాస్టల్ భవనాన్ని జీ ప్లస్5గా, ప్రిన్సిపాల్ క్వార్టర్ గెస్ట్ హౌజ్ జీ ప్లస్3గా అత్యాధునిక హంగులతో నిర్మించారు. దాంతో పాటు కళాశాలకు అనుబంధంగా క్యాంటిన్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. భవనాలకు రంగలను వేయడం పూర్తయింది.
భవనాల లోపల ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటీరియల్ డెకరేషన్ తదితర పనులను కాంట్రాక్టర్ శరవేగంగా చేయిస్తున్నారు. మెడికల్ కళాశాల భవనాల సమూదాయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా తలొగ్గకుండా నిర్మాణ పనులను పూర్తి చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయింపు
నల్లగొండ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. మెడికల్ కళాశాలకు కేటాయించిన 42 ఎకరాల స్థలంలోనే 5 ఎకరాలను నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో నర్సింగ్ కళాశాలను ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం నిధులు కేటాయిస్తే నర్సింగ్ కళాశాల భవనాన్ని నిర్మించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.